iphones: ‘ఆఫీసు పనులకు యాపిల్‌ ఫోన్లు వాడొద్దు’.. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రాగన్‌ హుకుం!

china- iphones: ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్‌ ఐఫోన్లను వినియోగించొద్దంటూ చైనా తమ ప్రభుత్వ ఉద్యోగులకు సూచించినట్లు తెలిసింది. ఐఫోన్లు (iPhones) సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని చెప్పినట్లు సమాచారం.

Updated : 06 Sep 2023 15:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా చైనా (China) ఉత్పత్తుల వాడకం పట్ల ఇతర దేశాలు భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తుంటాయి. అమెరికా, భారత్‌ సహా ఇదే కారణంతో కొన్ని కంపెనీల ఉత్పత్తులను, యాప్‌లను నిషేధించాయి కూడా. సరిగ్గా డ్రాగన్‌కు సైతం ఇప్పుడు అదే భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్‌ ఐఫోన్లు (iPhones) సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం. వాటిని కార్యాలయాలకూ తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

చైనా ప్రభుత్వానికి చెందిన ఉన్నతోద్యోగులు ఈ మేరకు కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. యాపిల్‌తో పాటు ఏయే ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నదీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ స్పష్టంగా పేర్కొనలేదు. దీనిపై చైనా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్‌ తన ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బ్రిటన్‌ రెండో అతిపెద్ద నగర పాలక సంస్థ దివాలా..!

చైనా కొన్నేళ్లుగా డేటా సెక్యూరిటీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చింది. కంపెనీలకు కొన్ని నియమాలను నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే నెలలో పెద్ద ప్రభుత్వరంగ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా ఆత్మనిర్భరతపై దృష్టి సారించాలని పేర్కొంది. వాణిజ్యం విషయంలో అమెరికా- చైనా మధ్య ఏళ్లుగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చైనాకు చెందిన హువావే కంపెనీని అమెరికా బ్యాన్‌ చేసింది. టిక్‌టాక్‌పైనా నిషేధం విధించింది. ఇప్పుడు చైనా సైతం అదే చేస్తోంది. తాజా నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ఇటీవల అమెరికా కామర్స్‌ సెక్రటరీ చైనాలో పర్యటించినప్పుడు చైనా పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. డ్రాగన్ దేశంలో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపై జరిమానాలు, దాడులు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని