UK: సోషల్‌ మీడియాలో.. టీనేజ్‌ పిల్లలకు బ్రిటన్‌ ‘నిషేధం’ విధించనుందా?

సోషల్‌ మీడియాను.. 16ఏళ్ల లోపు వారు వినియోగించకుండా ‘నిషేధం’ విధించడాన్ని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఒక ఆప్షన్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం.

Published : 15 Dec 2023 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారులు, యుక్తవయసు పిల్లలపై సామాజిక మాధ్యమాల (Social Media) ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై మరిన్ని నియంత్రణలు తెచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 16ఏళ్ల లోపు వారు వీటిని వినియోగించకుండా ‘నిషేధం’ విధించడాన్ని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఒక ఆప్షన్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం. దీనిపై యూకే ప్రభుత్వం (Britain) మరింత అధ్యయనం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఫేస్‌బుక్‌లో ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌ను తీసుకువస్తున్నట్లు మెటా ఇటీవల పేర్కొనడంపై బ్రిటన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని మెటాకు సూచించింది. ఇలా ఆన్‌లైన్‌ భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పిల్లలను ఫేస్‌బుక్‌లో అనుమతించడంపైనా నేషనల్‌ క్రైం ఏజెన్సీ తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల యువతకు నెలకొన్న ముప్పునకు సంబంధించిన ఆధారాలపై వచ్చే జనవరి నుంచి సంప్రదింపులు మొదలు పెట్టేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా 16ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం, తల్లిదండ్రుల నియంత్రణను మరింత పెంచడం వంటి అంశాలను చర్చించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ప్రిన్స్‌ హ్యారీ ఫోన్‌ హ్యాకింగ్‌ నిజమే..‘మిర్రర్‌’కు జరిమానా

ఈ పరిణామాలపై ప్రభుత్వ అధికార ప్రతినిధి కెమిల్లా మార్షల్‌ స్పందిస్తూ.. పూర్తి నిషేధం విధించడం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతపైనే తాము దృష్టి కేంద్రీకరించామని అన్నారు. నిషేధం కంటే తల్లిదండ్రులను మరింత అవగాహన కల్పించడమే ముఖ్యమన్నారు. అయితే, ఇప్పటివరకు ఉన్న పరిశోధనలు పూర్తిస్థాయిలో లేవని.. దానికోసం ఏ మేరకు మరింత అధ్యయనం అవసరమో చర్చించాల్సిన అవసరముందన్నారు. దీనిపై మంత్రులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఇదిలాఉంటే, చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతకు సంబంధించి ‘ఆన్‌లైన్‌ సేఫ్టీ యాక్ట్‌’ను (Online Safety Ac) బ్రిటన్‌ ఇటీవల తీసుకువచ్చింది. అయినప్పటికీ ఇటీవల సామాజిక మాధ్యమ వేదికల్లో వస్తోన్న మార్పుల దృష్ట్యా పిల్లలు ఆన్‌లైన్‌లో హానికర కంటెంటు బారిన పడకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని