Thailand: థాయ్‌లాండ్‌ కేవ్‌ రెస్క్యూ.. నాటి ఫుట్‌బాల్‌ టీం ‘కెప్టెన్‌’ మృతి

థాయ్‌లాండ్‌లోని గుహలో (Thailand Cave) బాలుర ఫుట్‌బాల్‌ బృందం చిక్కుకుపోయిన ఘటన 2018లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. ఆ భారీ రెస్య్కూ ఆపరేషన్‌లో బయటపడిన ఫుట్‌బాల్‌ (Football) టీం కెప్టెన్‌ ‘డోమ్‌’ ఇటీవల కన్నుమూశాడు.

Published : 16 Feb 2023 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫుట్‌బాల్‌ (Football) ఆడే బాలలు కోచ్‌తో కలిసి వరద నీటి గుహలో చిక్కుకుపోయిన ఘటన గుర్తుండే ఉంటుంది. థాయ్‌లాండ్‌లో 2018లో జరిగిన ఈ సంఘటన (Thailand cave rescue) ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి.. 18 రోజులపాటు తీవ్ర ప్రయత్నాల అనంతరం బాలలందర్నీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, ‘థాయ్‌ బాయ్స్‌’ ఫుట్‌బాల్‌ టీంకు కెప్టెన్‌గా ఉన్న దువాంగ్‌పెట్‌ ప్రోంతెప్‌ (డోమ్‌) ఇటీవల బ్రిటన్‌లో మరణించాడు. తలకు గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతడు చనిపోవడానికి కచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

థాయ్‌లాండ్‌ని థామ్‌ లువాంగ్‌ కేవ్‌ (Tham Luang Cave)లోకి వెళ్లిన ‘వైల్డ్‌ బోర్స్‌’ ఫుట్‌బాల్‌ బృందం.. అందులోని వరద నీటిలో చిక్కుకుపోయింది. అప్పట్లో ఈ ఫుట్‌బాల్‌ టీంకు ‘డోమ్‌’ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 13 సంవత్సరాలు. గుహలో చిక్కుకుపోయిన వారందరి వయసు 11 నుంచి 16ఏళ్ల మధ్యే ఉంది. తిండి, నిద్ర లేకపోవడంతో బతుకు మీద ఆశలు కోల్పోతున్న సమయంలో తన స్నేహితుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, ప్రతికూల వాతావరణంలోనూ అంతర్జాతీయ నిపుణులు, వేల మంది సైనికులు ఎంతో సాహసంతో చివరకు బాలలందర్నీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 23 జూన్‌ 2018లో చోటుచేసుకున్న ఈ ఘటనతో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ భారీ రెస్క్యూపై ఓ సినిమా కూడా వచ్చింది.

ఆ ఘటన తర్వాత కెప్టెన్‌ ప్రోంతెప్‌ ఇంగ్లాండ్‌లో చదువుకునేందుకు వెళ్లాడు. ఇందుకు అవసరమైన స్కాలర్‌షిప్‌ పొందడంలో జైకో ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకారం చేసింది. అయితే, బ్రిటన్‌లో ఉంటున్న ప్రోంతెప్‌ ఇటీవల తలకు గాయాలతో మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వారి స్వస్థలమైన థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌ రాయ్‌లో అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలువలేదని తెలిసినట్లు అక్కడి బౌద్ధ భిక్షువులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు