Great Train Robbery: రైలును హైజాక్‌ చేసి..30 నిమిషాల్లో రూ.500 కోట్లు దోచి..!

బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన ‘గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ’ (Great Train Robbery)కి పాల్పడిన వారిలో చివరి వ్యక్తి తాజాగా మృతి చెందాడు. అసలు ఆ దోపిడీ ఎలా, ఎప్పుడు జరిగిందంటే..? 

Published : 04 Nov 2023 01:48 IST

(దోపిడీ జరిగిన ప్రాంతం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: 15 మంది దొంగల ముఠా ఒక రైలును హైజాక్ చేసి.. 30 నిమిషాల్లో రూ.500 కోట్లు (ప్రస్తుత విలువ ప్రకారం) దోచుకెళ్లింది. ఇటీవల ఆ ముఠాలోని చివరి వ్యక్తి బాబీ వెల్చ్‌ మృతి చెందాడు. దాంతో ‘గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ’ స్టోరీ (Great Train Robbery) వైరల్‌గా మారింది. బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన ఆ దొంగల బండి కథను పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తాజాగా ప్రచురించాయి. 

సరిగ్గా 60 ఏళ్ల క్రితం.. 1963 ఆగస్టు 8న తెల్లవారుజామున మూడుగంటలకు ఈ గ్రేట్ ట్రైన్‌ రాబరీ (Great Train Robbery) జరిగింది. ఉత్తర లండన్‌లోని బ్రిడెగో బ్రిడ్జ్‌ సమీపంలో పెద్ద మొత్తంలో నగదుతో వెళ్తోన్న గ్లాస్గో-లండన్‌ రాయల్‌ మెయిల్‌ హైజాక్‌ అయ్యింది. నగదు గురించి ముందస్తు సమాచారం ఉన్న 15 మంది ఒక ముఠాగా ఏర్పడి.. భారీ దోపిడీకి ప్రణాళిక రచించారు. దానిలో భాగంగా వారు ముందుగా రైలు సిగ్నల్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. లైన్‌ సైడ్ సిగ్నల్‌ను ట్యాంపర్‌ చేసి, రైలు ఆగిపోయేలా చేశారు. హెల్మెట్లు, ముసుగులు, గ్లౌజులు ధరించి, 150 గోనె సంచులతో రైలులోకి ప్రవేశించారు. తొలుత రైలు లోకో పైలట్‌, కో పైలట్‌పై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత దొంగలు 2.6 మిలియన్‌ పౌండ్లను దోచేశారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆ మొత్తం రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశం.. ఏడాదిలో 97 వేల మంది భారతీయుల అరెస్టు

15 మంది కలిసి కేవలం 30 నిమిషాల్లోనే దోచుకున్న సొమ్మునంతా ల్యాండ్‌ రోవర్‌ కార్లలో కొద్దిరోజుల ముందే కొనుగోలు చేసిన ఒక ఫాంహౌస్‌కు తరలించారు. అక్కడే దానిని వాటాలు పంచుకున్నారు. తర్వాత ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆ ఫాంహౌస్‌ను కాల్చివేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆరుగురు వ్యక్తుల్ని నియమించి ఆ పనిని అప్పగించారు. సరిగ్గా ఇక్కడే వారి ప్లాన్ బెడిసి కొట్టింది. ఫౌంహౌస్‌ పూర్తిగా కాలిపోకపోవడంతో పోలీసులకు కొన్ని వేలిముద్రలు దొరికాయి. అప్పటికే మరి కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఈ వేలి ముద్రల సహాయంతో 12 మందిని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. అయితే, ఆ ముఠాలోని కీలక వ్యక్తి రోన్నీ బిగ్స్ కొద్దిరోజులకే జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొని ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ దేశాలన్నీ తిరిగి చివరకు 2001లో యూకేలో అడుగుపెట్టాడు. అప్పుడు మళ్లీ పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు. అతడు 2013లో లండన్‌లోని ఒక కేర్‌ హోంలో మృతి చెందాడు.  

ఈ దోపిడీకి నాయకత్వం వహించిన బ్రూస్‌ రేనాల్డ్స్‌.. జైలు నుంచి విడుదలైన తర్వాత 1995లో ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ థీఫ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అతడు కూడా 2013లోనే చనిపోయాడు. మరో నేరస్థుడు రొనాల్డ్‌ ఎడ్వర్డ్స్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత వాటర్లూ స్టేషన్ బయట పుష్పగుచ్ఛాలు విక్రయిస్తూ జీవనం సాగించాడు. 1994లో అతడు సైతం ఉరి వేసుకొని చనిపోయాడు. దోపిడీ ముఠాలో చివరి వ్యక్తి అయిన బాబీ వెల్చ్‌ ఇటీవల మరణించాడు. వయోభారం పెరిగి అనారోగ్యంతో కన్నుమూశాడు. వెల్చ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడినప్పటికీ.. 1976లో జైలు నుంచి బయటకు వచ్చాడు. తర్వాత అతడి కాలుకు జరిగిన చికిత్స వికటించడంతో వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు. ఈ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. వారిలో ఒకరి గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. ఇదిలా ఉంటే.. పోలీసులు దొంగల్ని పట్టుకున్నప్పటికీ, దోపిడీ గురైన సొత్తులో చాలా వరకు తిరిగి స్వాధీనం చేసుకోలేదట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని