Donald Trump: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

Donald Trump: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో ట్రంప్‌ మరో ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా న్యూ హాంప్‌షైర్‌లోనూ విజయాన్ని నమోదు చేయడం ఖాయమైంది.

Updated : 24 Jan 2024 09:51 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా న్యూ హాంప్‌షైర్‌లోనూ (Hampshire primary) ఘన విజయం సాధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు.

మాజీ అధ్యక్షుడైన 77 ఏళ్ల ట్రంప్‌ న్యూ హాంప్‌షైర్‌లో 52.5 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారని అమెరికన్‌ మీడియా వెల్లడించింది. 46.6 శాతం ఓట్లతో దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ (Nikki Haley) గట్టి పోటీ ఇస్తున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానప్పటికీ.. ట్రంప్‌నకే విజయం వరిస్తుందని అక్కడి మీడియా సంస్థలు కచ్చితమైన అంచనాకు వచ్చేశాయి. హేలీ అంచనాల కంటే మెరుగ్గానే రాణించారని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమెరికా బరిలో వృద్ధ సింహాలేనా?

న్యూ హాంప్‌షైర్‌ ప్రైమరీలో వరుసగా మూడుసార్లు గెలిచిన రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్ (Donald Trump) ఒక్కరేనని ఇటీవల రేసు నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి అన్నారు. ఈ దశలోనే హేలీ పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్‌నకు మద్దతు ప్రకటించాలని హితవు పలికారు. పోటీ నుంచి వైదొలగాలని ట్రంప్‌ ప్రచార బృందం సైతం ఆమెకు సూచించింది. ఇలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి దోహదం చేసినవారవుతారని విమర్శించింది.

హేలీ (Nikki Haley) మాత్రం రేసులో కొనసాగడానికే నిర్ణయించుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఓవైపు ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. రేసు ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించారు. పోటీ ఇంకా తొలి దశలోనే ఉందని.. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. రిపబ్లికన్‌ అభ్యర్థిత్వం కోసం మొత్తం 14 మంది పోటీకి దిగగా.. చివరకు తాను మాత్రమే ట్రంప్‌తో పోరాడుతున్నానని తెలిపారు. బైడెన్‌-హ్యారిస్‌ను ఓడించే సత్తా తనకు మాత్రమే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయన్నారు. డెమొక్రాట్లు ట్రంపే అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారని.. అప్పుడే వారికి విజయం సులువవుతుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు