Erdogan: స్వీడన్‌ నాటో సభ్యత్వానికి తుర్కియే మరోసారి మోకాలడ్డు!

‘నాటో’లో స్వీడన్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో తుర్కియే మరోసారి షరతులను తెరపైకి తెచ్చింది. ‘ఎఫ్‌-16’ యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేసింది.

Published : 20 Dec 2023 02:16 IST

అంకారా: పశ్చిమ దేశాల సైనిక కూటమి ‘నాటో(NATO)’లో స్వీడన్‌ (Sweden)కు సభ్యత్వం విషయంలో తుర్కియే మరోసారి మోకాలడ్డింది! స్వీడన్‌ పెట్టుకున్న దరఖాస్తుకు తుర్కియే (Turkey) పార్లమెంటు ఆమోదం తెలిపే విషయంలో ఆయా షరతులను తెరపైకి తీసుకొచ్చింది. అమెరికా నుంచి ‘ఎఫ్‌-16’ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న తమ అభ్యర్థనకు అక్కడి చట్టసభలు ఆమోదం తెలపాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ డిమాండ్‌ చేశారు. అదే విధంగా కెనడా, ఇతర నాటో మిత్రదేశాలు తమపై విధించిన ఆయుధ ఆంక్షలను ఎత్తివేయాలన్నారు.

‘‘ఎఫ్‌-16 యుద్ధ విమానాల విషయంలో అమెరికా నుంచి సానుకూల పరిణామాలు, ఆయుధ ఆంక్షల ఎత్తివేతపై కెనడా తన వాగ్దానాలను నిలబెట్టుకోవడం.. స్వీడన్ దరఖాస్తుపై తుర్కియే పార్లమెంట్ కార్యాచరణను వేగవంతం చేస్తాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి’’ అని ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. హంగరీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తోన్న సమయంలో ఆయన ఈమేరకు మాట్లాడారు. స్వీడన్‌ సభ్యత్వ దరఖాస్తును ఇప్పటివరకు అధికారికంగా ఆమోదించని రెండు నాటో దేశాలు తుర్కియే, హంగరీలే కావడం గమనార్హం.

విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..

గతంలోనూ ‘నాటో’లో స్వీడన్‌ చేరికకు ఎర్డోగాన్‌ మెలిక పెట్టారు. ‘ఈయూ’లో తుర్కియే చేరేందుకు అనుమతించాలని షరతు విధించారు. ‘‘తుర్కియే కోసం మొదట ఈయూ తలుపులు తెరవండి. మీరు మాకు మార్గం సుగమం చేస్తే.. మేం సైతం స్వీడన్‌కు దారి ఇస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే, జులైలో లిథువేనియాలో నిర్వహించిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఎలాంటి షరతులు లేకుండానే స్వీడన్‌ చేరికకు ఒప్పుకొన్నారు. సంబంధిత దరఖాస్తును తుర్కియే పార్లమెంట్‌ ఆమోదానికి పంపేందుకు అంగీకరించారు. తాజాగా ఇక్కడ మరోసారి బ్రేకులు పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని