Braverman: వివాదాలకు కేంద్ర బిందువు.. అయినా ఆమెకే ప్రధాని మద్దతు

ఇటీవల పలు అంశాల్లో భిన్న వైఖరి ప్రదర్శించిన సుయెల్లా బ్రేవర్మన్‌కు రిషి సునాక్‌ మంత్రివర్గంలో మళ్లీ చోటుదక్కింది. దీనిపై విపక్ష పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ.. బ్రిటన్‌ యువ ప్రధాని ఆమెనే సమర్థించారు. చేసిన తప్పును ఆమె అంగీకరించారని.. ఇకపై దేశ భద్రతపై దృష్టి పెడతారని చెబుతూ దీటుగా సమాధానమిచ్చారు.

Published : 27 Oct 2022 01:52 IST

లండన్‌: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు బ్రేవర్మన్‌ (Suella Braverman) రూపంలో కొత్త తలనొప్పులు మొదలైనట్లు కనిపిస్తోంది. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడి రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి అదే పదవిలో కన్జర్వేటివ్‌ పార్టీ ఎలా నియమిస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా పలు విధాన నిర్ణయాల్లో.. ముఖ్యంగా వలస విధానంలో ఆమె తీసుకున్న నిర్ణయం సొంత పార్టీలోనే విమర్శలకు దారితీయడాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఇటువంటి ప్రశ్నలను ఎదుర్కొన్న రిషి సునాక్‌ (Rishi Sunak).. చేసిన తప్పులను అంగీకరించినందున తిరిగి అదే పదవిలో నియమించామంటూ ఆమెకు మద్దతుగా నిలవడం విశేషం.

భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు

వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోతున్నారంటూ  ఆ దేశ హోంమంత్రిగా ఉన్న బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీసా కాలపరిమితి మించి బ్రిటన్‌లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులని పేర్కొనడం ఆ దేశ విదేశాంగ శాఖను చిక్కుల్లో పడేసింది. భారత్‌తో ఓపెన్‌ బోర్డర్‌ మైగ్రేషన్‌ పాలసీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. భారత్‌తో చేసుకొన్న ఒప్పందం వల్ల పెద్ద ప్రయోజనం లేదని విమర్శించారు. మరో సమయంలో వలస విధానంపై మాట్లాడిన ఆమె.. బ్రిటన్‌కు అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రవాండాకు తరలించడం తన కల అని పేర్కొనడం గమనార్హం. అయితే, దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించడంతో బ్రిటన్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ప్రధానిపై విమర్శలు..

మూడు నెలల క్రితం.. ప్రధానమంత్రి పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన వారిలో బ్రేవర్మన్‌ ఒకరు. చివరకు బోరిస్‌ పదవి నుంచి దిగిపోయిన తర్వాత జరిగిన టోరీ సభ్యుల ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌ విజయం సాధించడం.. తర్వాత లిజ్‌ మంత్రివర్గంలో బ్రేవర్మన్‌కు చోటు లభించడం జరిగిపోయాయి. అయినప్పటికీ లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వంపైనా బ్రేవర్మన్‌ విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను లిజ్‌ ట్రస్‌ ఉల్లంఘిస్తున్నారంటూ బ్రేవర్మన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆమె స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ తన పదవిని పోగొట్టుకున్నారు.

రిషినే సరైన నాయకుడు..

ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ రాజీనామా తర్వాత స్వరం మార్చిన బ్రేవర్మన్‌.. రిషి సునాక్‌కే తన పూర్తి మద్దతని ప్రకటించారు. ఐక్యత, స్థిరత్వం, సమర్థత కలిగిన నాయకుడు రిషినే అన్న ఆమె.. పార్టీకి, దేశానికి బోరిస్‌ జాన్సన్‌ సరైన ఎంపిక కాదన్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడంతోపాటు పార్టీలోనూ చీలిక వచ్చే అవకాశం ఉందని.. పరిస్థితులు మారాలంటే రిషి సునాక్‌ సరైన నాయకుడని కొనియాడారు.

తప్పులను అంగీకరించారు..

ఇలా బ్రిటన్‌ రాజకీయాల్లో పలు వివాదాలకు కారణమైన బ్రేవర్మన్‌ను.. బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమెపై విమర్శలు వచ్చినప్పటికీ ఆమెవైపే రిషి సునాక్‌ నిలబడ్డారు. నేరస్థులపై ఉక్కుపాదం మోపడంతోపాటు దేశ సరిహద్దులను రక్షించుకోవడంపై హోంశాఖ మంత్రి దృష్టి సారిస్తారని.. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రధానమంత్రి రిషి సునాక్‌ దీటుగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని