Viral post: ‘సింగిల్ వర్డ్‌’ రిజెక్షన్‌.. సంస్థ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు

ఉద్యోగం కోసం పరీక్షలను, ఇంటర్య్వూలను ఎదుర్కొన్న అనంతరం సెలక్ట్‌ అయ్యామా? లేదా?అనేది కంపెనీ నుంచి వచ్చే సమాధానంతో తెలుస్తుంది. కొన్ని సంస్థలు నేరుగా అభ్యర్థికి కాల్‌ చేసి చెబుతుంటాయి. మరికొన్ని మెయిల్స్‌ రూపంలో తెలియజేస్తాయి.

Published : 07 Apr 2024 14:43 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఉద్యోగం కోసం పరీక్షలను, ఇంటర్య్వూలను ఎదుర్కొన్న అనంతరం సెలక్ట్‌ అయ్యామా? లేదా?అనేది కంపెనీ నుంచి వచ్చే సమాధానంతో తెలుస్తుంది. కొన్ని సంస్థలు నేరుగా అభ్యర్థికి కాల్‌ చేసి చెబుతుంటాయి. మరికొన్ని మెయిల్స్‌ రూపంలో తెలియజేస్తాయి. అలాగే సెలక్ట్‌ కాకపోతే ఎందుకు చేయలేదనే విషయమూ అందులో ప్రస్తావిస్తుంటారు. కానీ, ఇటీవల ఓ అభ్యర్థికి మాత్రం విభిన్నమైన అనుభవం ఎదురైంది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నార్త్ కరోలినాకు చెందిన సంస్థ నిర్వహించిన ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. కొన్నాళ్లకు ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదని ఒకే ఒక్క పదంతో మెయిల్‌ చేసింది. ఆ సింగిల్‌ వర్డ్‌ మెయిల్‌ స్క్రీన్‌ షాట్‌ను సామాజిక మాధ్యమం రెడిట్‌ వేదికగా పంచుకున్నారు. ఆ మెయిల్‌లో ఎటువంటి మర్యాదపూర్వక పదాలు లేవు. ‘డిక్లైన్’ అని మాత్రమే రాసి ఉంది. ‘‘ఇన్నేళ్లలో ఇటువంటి తిరస్కరణను ఎప్పుడూ చూడలేదు. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. ఇది మర్యాదపూర్వకమా? అనాగరికమా?’’ అంటూ సదరు వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు సంస్థ తీరుపై విమర్శలు గుప్పించారు.

అభ్యర్థి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో కంపెనీ స్పందించింది. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ మెయిల్‌ చేసింది. ‘‘మా ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్ లోపం వల్ల ఈ విధంగా జరిగింది. దీని గురించి మాకు ఇటీవలే తెలిసింది. కొన్ని ఓపెనింగ్‌ల కోసం దరఖాస్తుదారులకు ‘డిక్లైన్’ అనే ఒకే పదంతో సిస్టమ్‌ మెయిల్‌ను పంపింది. మా కంపెనీలో దరఖాస్తు చేసుకున్న వారికి మర్యాదపూర్వకంగా స్పందనను తెలియజేస్తాం. ఈ పొరపాటుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం’’ అంటూ సంస్థ రాసుకొచ్చింది.

కంపెనీ స్పందించిన విషయాన్ని తెలుపుతూ ఆ వ్యక్తి ‘‘నేను చేసిన పోస్టుకు సంస్థ స్పందించింది. మీలో (నెటిజన్లను ఉద్దేశించి) కొందరు ఇదే విధంగా మెయిల్‌ను అందుకున్నారని స్క్రీన్‌షాట్‌లు పంపారు. ఈ విషయంపై మీలో ఒకరు కంపెనీని సంప్రదించి ఉంటారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. స్పందించినందుకు సంస్థకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని