జెలెన్‌స్కీ రష్యాకు చిక్కడు..! అమెరికా ప్లాన్‌ను వెల్లడించిన మాజీ అధికారి

రష్యా (Russia) సైన్యం ముందుకుసాగుతోన్న తరుణంలో అమెరికా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)ని రక్షించుకునే పనిలో పడింది.  

Published : 06 Mar 2024 12:23 IST

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తయింది. ఇంతవరకు ఏ పక్షానికి విజయం దక్కలేదు. పలు ప్రాంతాల్లో పుతిన్‌ సేనలే ముందజ వేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ (Zelensky)ని రాజధాని కీవ్‌ నుంచి అమెరికా(America) తరలించనుందట. ఈ మేరకు పెంటగాన్ మాజీ అధికారి ఒక స్టీఫెన్ బ్రియెన్‌ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. 

‘ప్రస్తుతం ఉక్రెయిన్‌కు తగినస్థాయిలో సిబ్బంది లేరు. అది మానవ వనరుల సమస్యను ఎదుర్కొంటోంది. బలవంతంగా నియామకాల కోసం చేసే ప్రయత్నాలు అశాంతికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఎంతకాలం కీవ్‌లో జెలెన్‌స్కీ ప్రభుత్వం ఉంటుందో తెలీదు. క్రమంగా రష్యా సైన్యం ముందంజ వేస్తుండటం.. స్వదేశంలో పెరుగుతోన్న అశాంతి.. ఎన్నికల  నిర్వహణకు విముఖత.. అధ్యక్షుడి విధానాలను వ్యతిరేకించే వారిని జైల్లో పెట్టడం.. ఆయన భద్రతపై నీలినీడలు కమ్ముకోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా జెలెన్‌స్కీని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు పోలండ్ సరిహద్దుల్లోని లివివ్‌ను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. రష్యా తన సైన్యంతో ఆ ప్రాంతాన్ని చేరుకోవడం సవాలుగా మారుతుంది. అందుకే అది తగిన ఎంపిక కావొచ్చు’ అని స్టీఫెన్ వెల్లడించారు. 

బైడన్‌ ప్రభుత్వం అఫ్గానిస్థాన్‌ తరహా మరో అనుభవాన్ని తట్టుకొనే పరిస్థితుల్లో లేదు. అందుకే అమెరికా, నాటో ఈ తరలింపు గురించి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని