China: భూకంపంలో 6వేలకు పైగా ఇళ్లు ధ్వంసం.. రంగంలోకి జిన్‌పింగ్‌

చైనా(China)లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.2గా నమోదయ్యింది. ఈ విపత్తుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. 

Updated : 19 Dec 2023 12:34 IST

బీజింగ్‌: చైనా(China)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా.. సుమారు 116 మందికిపైగా మృతి చెందారు. 400 మందికిపైగానే గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్సు, కున్‌ఘీ ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రంగంలోకి దిగారు. అధికారులను అప్రమత్తం చేశారు.

రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపై పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 6,381 ఇళ్లు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్‌పై వంతెన బీటలువారింది.  సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  కున్‌ఘీ ప్రావిన్స్‌.. టిబెట్‌కు సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కున్‌ఘీ పక్కన ఉండే గ్జిన్జియాంగ్ ఉయ్‌గుర్‌లో మంగళవారం మరోసారి భూమి కంపించింది.

ఆస్ట్రేలియాలో భారీ వరదలు

భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) అధికారులను ఆదేశించారు. తక్షణ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. భూకంపం ప్రభావంతో సంభవించే మార్పుల వల్ల పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు