నావికా నాయికా
close
Updated : 23/05/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నావికా నాయికా

అమెరికాలో తెలుగు తేజం

వేల దరఖాస్తులు.. రకరకాల వడపోతలు...

నాలుగేళ్ల కఠోర శిక్షణ...

ఇవి పూర్తి చేస్తేనే పైలట్‌గా ఎంపిక...

అన్ని దశలనూ అవలీలగా దాటుకొని ప్రతిష్ఠాత్మక అమెరికా నావికాదళానికి ఎంపికైంది తెలుగు తేజం దొంతినేని దేవిశ్రీ...

ఈ స్థాయి అందుకున్న తొలి భారత సంతతి అమ్మాయిగా ఘనత సాధించింది... ఆ స్ఫూర్తి కెరటాన్ని వసుంధర పలకరించింది.

త్యంత శక్తిమంతమైన అమెరికా నావికాదళానికి ఎంపికవడం అంటే మాటలు కాదు. అందునా అమ్మాయిలకైతే ఇది కఠిన సవాలుతో కూడుకున్న విషయం. నాలుగేళ్లపాటు కఠోర శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాలి. ప్రపంచంలో ఏమూలనైనా పని చేయాలి. వీటన్నింటికీ సిద్ధపడి అసాధారణ ప్రతిభతో అరుదైన అవకాశం దక్కించుకుంది దేవిశ్రీ.

వేలల్లో ఒకరిగా

గుంటూరు జిల్లా బోడిపాలెం గ్రామానికి దేవిశ్రీ అమ్మానాన్నలు శ్రీనివాస్‌, అనుపమలు ఉద్యోగరీత్యా ముప్ఫై ఏళ్ల కిందటే అమెరికాలోని లాంగ్‌ఐలాండ్‌లో స్థిరపడ్డారు. దేవిశ్రీ ఇంటి సమీపంలో కెన్నత్‌ అనే ఓ నేవీ అధికారి ఉండేవారు. ఆయన స్ఫూర్తితో అమెరికన్‌ నేవీలో చేరాలనుకుంది. ఇంటర్‌ తర్వాత నేవీ అకాడెమీ ప్రవేశ పరీక్షకు హాజరైంది. దీనికి దేశవ్యాప్తంగా యాభై రాష్ట్రాల నుంచి 17 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి, రకరకాల వడపోతల అనంతరం వెయ్యిమందిని అకాడెమీకి ఎంపిక చేశారు. అందులో ఒకరిగా నిలిచింది దేవిశ్రీ. నావెల్‌ అకాడెమీకి ఎంపికైన తొలి భారత సంతతి యువతిగా రికార్డు సృష్టించింది.

దేశానికి సేవ చేయాలన్న ఆలోచన విద్యార్థి దశ నుంచే ఉంది. సవాళ్లతో కూడుకున్న కఠినమైన విధులు నిర్వర్తించాల్సిన నావికాదళంలో పని చేయాలన్న నా నిర్ణయాన్ని తల్లిదండ్రులు మనఃస్ఫూర్తిగా అంగీకరించి మద్దతు తెలిపారు. నేను దూరంగా ఉండటం కుటుంబానికి వెలితిగానే ఉంటుంది. అయినా నాలాంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు, భయపడకు అని అమ్మతో చెబుతుంటా. నన్ను చూసి అమ్మాయిలు స్ఫూర్తి పొందాలని భావిస్తా. అందుకోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నా. ఇదే పుట్టిన దేశానికి నేను తీర్చుకునే రుణం.

2016 జూన్‌లో దేవిశ్రీ శిక్షణ మొదలైంది. ఆమె శారీరక, మానసిక ధృఢత్వాన్ని పరీక్షించే సమయమిది. ఒకవేళ శత్రువుల చెరలో చిక్కుకుంటే అన్నిరకాల బాధల్ని ఓర్చుకునేలా శిక్షణ ఉండేది. బరువులు మోస్తూ పరుగెత్తడం, ఎత్తులు దూకడం, నీటిపై రోజులకొద్దీ ప్రయాణించడం, కఠిన వాతావరణ పరిస్థితుల్లో గుండె నిబ్బరం కనబరచడం.. ఇలాంటివెన్నో. ఈ సమయంలో ఏడాదికి రెండు, మూడుసార్లే ఇంటికి పంపించేవారు. ఈ కష్టాలు భరించలేక చాలామంది శిక్షణ ఆరు వారాల్లోపే వదిలేసి వెళ్లిపోయేవారు. ఒక్కోసారి తనకూ అలాంటి ఆలోచన వచ్చినా లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ పట్టుదలగా ముందుకెళ్లేది. అలా నాలుగేళ్ల కష్టతర శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంది. దేవిశ్రీకి నీటిలో ఉండటం, నీటిపై విధులు నిర్వహించడం కన్నా గాలిలో ఎగరడం అత్యంత ఇష్టం కావడంతో నేవీ పైలట్‌ కెరీర్‌ను ఎంచుకుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఫ్లోరిడాలో మరో రెండేళ్లు శిక్షణ ఉంటుంది. ఇందులో ఫ్లైట్‌ ప్లాన్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ పర్ఫార్మెన్స్‌, వాతావరణంలో మార్పులు గమనించడం, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌, రాడార్‌, నేవిగేషన్‌ వ్యవస్థలన్నింటిపై పట్టు సాధించబోతోంది. ఆయుధాలు ఉపయోగించడమూ నేర్చుకోబోతోంది. శిక్షణ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా నావికా దళ బేస్‌లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ సిద్ధపడిన తర్వాతే నేవీకి దరఖాస్తు చేశానంటోంది దేవిశ్రీ.

- ఇనగంటి దిలీప్‌, న్యూస్‌టుడే: పొన్నూరు


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని