చలి పులి...ఆ గిలి వద్దు
close
Updated : 25/12/2019 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చలి పులి...ఆ గిలి వద్దు

శీతాకాలం వచ్చిందంటే చాలు శరీరం మానసికంగా, శారీరకంగా తీవ్రంగా ప్రభావితమవుతుంది. సరైన సంరక్షణ తీసుకోకపోతే చర్మం, శిరోజాలు, గోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. ఫలితంగా ముఖంలో వయసు ఛాయలు కనిపిస్తాయి. మరి ఇప్పుడేం చేయాలి?

చలికాలంలో వెచ్చటి సూర్యకిరణాలు మనసుకు ఆనందంగానే ఉంటాయి. అలాని సూర్యరశ్మి నేరుగా చర్మానికి తాకకుండా జాగ్రత్తపడాలి. లేదంటే చర్మంపై ఈ కిరణాల ప్రభావంపడి చర్మం పొడిబారిట్లుగా మారిపోతుంది. నల్లని మచ్చలు ఏర్పడతాయి. సన్‌స్క్రీన్‌లోషన్‌ వేసవిలో మాత్రమే అనుకోవద్దు. చలికాలంలోనూ... బయటికి వెళ్లినప్పుడు ముఖానికి, చర్మానికి రాసుకోవడం మంచిది. ఇది  సూర్యకిరణాల ప్రభావం పడకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఎండ తీవ్రతతో సంబంధం లేకుండా రాసుకోవాలి.

ఒత్తిడి లేకుండా...
ఒత్తిడి మననెంతగా చిత్తు చేస్తుందో తెలియని విషయం కాదు. దీని నుంచి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. లేదంటే ఈ ప్రభావంతో మానసికంగానే కాదు, శారీరకపరమైన మార్పులెన్నో చోటు చేసుకుంటాయి. ఫలితంగా చర్మం కాంతిహీనంగా మారుతుంది. యుక్తవయసులోనే వయసు పైబడినట్లు కనిపిస్తారు. ఒత్తిడికి కారణాలను తెలుసుకోగలిగి, అందులోంచి బయటపడటానికి ప్రయత్నించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవడం, స్నేహితులతో మాట్లాడటం, ఆత్మీయులతో సమస్యలను చర్చించడం, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి అభిరుచులను పెంపొందించుకోవడం చేయాలి. ముఖ్యంగా  కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం అలవరుచుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

కాలుష్యానికో గొడుగు..
మంచు, కాలుష్యం కలగలసిన స్మాగ్‌ మన చర్మంపై ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ కాలుష్యం కారణంగా చర్మంముడతలు పడిపోవడం, జుట్టు పొడిబారడం, ముఖంపై వృద్ధాప్యఛాయలు కనిపించడం, పిగ్మెంటేషన్‌కు గురికావడం వంటివి ఎదురవుతాయి. దీన్నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే చర్మకణాల్లోకి మురికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం నాణ్యమైన క్లెన్సింగ్‌ ఉత్పత్తులని ఉపయోగిస్తే మంచిది.

పండ్లు తప్పనిసరి...
శీతాకాలం జీవక్రియల వేగం తక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే. దాంతో ఒకలాంటి నైరాశ్యం ఆవరిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచి, నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శీతాకాలంలో తరచూ దాడిచేసే అలెర్జీలకు దూరంగా ఉంచుతాయి. ఎండ తాలూకూ దుష్ప్రభావాలు మనపై పడకుండా చర్మాన్ని కాపాడతాయి. వృద్ధాప్యఛాయలు రానివ్వకుండా, చర్మం పొడిబారకుండా, పిగ్మంటేషన్‌కు దూరంగా ఉండేలా చేసే శక్తి తాజా పండ్లకు ఉంటుంది. నిత్యం తీసుకునే ఆహారంలో రెండు లేదా మూడు రకాల పండ్లు ఉండేలా చూసుకుంటే మంచిది.

నీరు తాగుతున్నారా?
చలికాలం నీళ్లు తాగాలనిపించదు. అయినా సరే తగినంత నీరు తీసుకోవాల్సిందే. శరీరంలో తగినంత నీటి శాతం లేకపోతే, వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. రోజులో కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే...చర్మం, శిరోజాలు ఆరోగ్యంతో నిగనిగలాడతాయి.

వ్యాయామం తప్పనిసరి...
ఆహారంతోపాటు శరీరానికి వ్యాయామం తప్పనిసరి. వ్యాయాయం రక్తప్రసరణను చురుగ్గా ఉండేలా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు మన చర్మం, శిరోజాలకు చేరడానికి దోహదం చేస్తుంది. జిమ్‌లోనే కాకుండా,  వ్యాయామంలో భాగంగా పరుగు, తోటపని, వేగంగా నడవడం వంటివీ... జోడించుకుంటే మంచిది.

కంటినిండా నిద్ర...
అలసిన శరీరానికి కనీసంలో కనీసం ఆరు నుంచి ఏడు గంటలపాటు కంటినిండా నిద్రకావాలి. అప్పుడే తిరిగి మన శరీరం ఉత్తేజం పొందుతుంది. లేదంటే నిద్రలేమితో తీవ్ర అనారోగ్యాలు దరిచేరతాయి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని