close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
14 వరకూ ఎక్కడివక్కడే

రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో
కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 14వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  సీఆర్‌డీఏ అధికారులకు, తదితరులకు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.  
రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ, సీˆఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలను, చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరో ఆరుగురు రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చి.. మూడు రాజధానుల ఏర్పాటుకు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్‌భవన్‌, సీఎం కార్యాలయం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, పోలీసు శాఖ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మరోవైపు సీఆర్‌డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధానిపై విశ్రాంత ఐఏఎస్‌ జీఎన్‌రావు నిపుణుల కమిటీ, బోస్టన్‌ కమిటీ, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను సవాలు చేస్తూ టి.శ్రీనివాసరావు, డి.సాంబశివరావు హైకోర్టులో 3 వ్యాజ్యాలు వేశారు.

మమకారాన్ని చంపుకొని భూములు త్యాగం చేశారు: శ్యాం దివాన్‌
ఈ వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. రాజధాని నగర నిర్మాణానికి రైతులు వేల ఎకరాల భూములను ఇచ్చారన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే వారి జీవనాధారం పోతుందన్నారు. ప్రజల జీవనాధారం లేకుండా చేసే చట్టాలు ఏవైనా చెల్లుబాటు కావంటూ వాటిని రద్దు చేయాలన్నారు. భూములపై మమకారాన్ని చంపుకొని రాజధాని కోసం భూములను త్యాగం చేశారన్నారు. రాజధాని విషయంలో ఈ ఏడాది జనవరి 20 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ‘ఉన్నతస్థాయి కమిటీ’ని హైకోర్టు ఆదేశించినా.. జనవరి 17నే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం స్టేటస్‌ కో ఆదేశాలు ఇవ్వకపోతే పది రోజుల్లో కార్యాలయాలు తరలించేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
పది రోజులు ఆగితే ఏమవుతుంది
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది జోక్యం చేసుకుంటూ.. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు కౌంటర్‌ దాఖలు చేయడానికి పది రోజుల గడువు కావాలని కోరారు. గడువు తీసుకుంటే అభ్యంతరం లేదు గానీ, ఈలోపు కార్యాలయాలు తరలించబోమని హామీ తీసుకోవాలని శ్యాం దివాన్‌ కోరారు. అయితే.. దీనికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం లేదని, తాము హామీ ఇవ్వలేమని రాకేశ్‌ ద్వివేది చెప్పారు. రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆ సమయంలో.. కౌంటర్‌ వేసే వరకూ (పది రోజులు) వేచి ఉంటే ఏమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పది రోజుల్లో కార్యాలయాలను తరలిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. వ్యాజ్యాల్లో పిటిషనర్లు గెలిస్తే తరలిపోయిన కార్యాలయాలను వెనక్కి తీసుకురావాలంటూ తాము ఆదేశించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తరహా ఉత్తర్వులిచ్చినా తప్పులేదు కానీ ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం లేదని రాకేశ్‌ ద్వివేది అన్నారు. యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వడమంటే ఓ విధంగా స్టే ఇచ్చినట్లు అవుతుందన్నారు. సీఆర్‌డీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 14 వరకూ రాజధానిలో ప్రస్తుతం ఉన్న స్థితినే పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ స్టేటస్‌ కో ఉత్తర్వులిచ్చింది.
మరికొన్ని వ్యాజ్యాలు
పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆడిటర్‌ లంకా దినకర్‌, గుంటూరు మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మరికొందరు వీటిని దాఖలు చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.