ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్‌ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) వ్యాఖ్యానించింది.

Updated : 10 May 2024 08:08 IST

ఐపీఎస్‌ అధికారిపై రెండోసారి చర్యలు తీసుకోవడం సుప్రీం ఉత్తర్వుల ధిక్కరణే
ఏబీవీ సస్పెన్షన్‌పై తీర్పు వెలువరిస్తూ క్యాట్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్‌ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) వ్యాఖ్యానించింది. సరైన కారణాలు లేకుండా సస్పెండ్‌ చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని పేర్కొంది. తనను రెండోసారి సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం 2022 జూన్‌ 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై వాదనలు విన్న క్యాట్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు లతా బస్వరాజ్‌, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు శాలినీ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఆయనకు బాధ్యతలు అప్పగించడంతోపాటు వేతన బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంకటేశ్వరరావుపై క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. ఇందులో భాగంగా ఏఐఎస్‌ (డి అండ్‌ ఏ) 3(3) నిబంధన కింద సస్పెన్షన్‌ చేసే అధికారం ఉందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో విభేదించింది. కేవలం మీడియా ప్రకటన విడుదల ఆధారంగా సస్పెన్షన్‌ వేటు వేయడం సరికాదంది. మీడియా ప్రకటన విడుదల చేసినందుకు శాఖాపరమైన చర్యల్లో భాగంగా షోకాజ్‌ నోటీసు జారీ అయిందని గుర్తుచేసింది. ఈ అంశానికి సంబంధించి తదుపరి క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. అందుకు విరుద్ధంగా రెండోసారి సస్పెన్షన్‌ వేటు వేసిందని పేర్కొంది. కింది కోర్టులో గతేడాది జనవరి 23న అభియోగపత్రం దాఖలు చేసినా.. సస్పెన్షన్‌ను పునఃసమీక్షించడం, ఎత్తివేయడంగానీ చేయలేదంది. సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు, దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు ఆధారాలుంటే వెంకటేశ్వరరావు ప్రీఅరెస్ట్‌ బెయిలును రద్దు చేయాలని కోరవచ్చని.. షరతులను ఉల్లంఘించినందున బెయిలు రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. రెండేళ్లకు మించి సస్పెండ్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి నియమించాలని 2022ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది. క్రిమినల్‌ కేసు దర్యాప్తు పేరుతో పరిమితి లేని సస్పెన్షన్‌ను కొనసాగించడానికి వీల్లేదని ఇటీవల పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసుకూ వర్తిస్తాయని పేర్కొంది. దీనిప్రకారం కారణాలు లేకుండా వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. మీడియా ప్రకటన మినహా ఎలాంటి కారణాలు లేకుండా  సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమేనని, అది చెల్లదని తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని