ఒంగోలులో మువ్వన్నెల శోభ

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఒంగోలులో ఆదివారం మూడు కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. రవిప్రియ మాల్‌సెంటర్‌ నుంచి మినీ స్టేడియం వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ప్రజలు దాదాపు 10వేల మందికిపైగా పాల్గొన్నారు. ర్యాలీలో జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను ప్రదర్శించారు. దేశభక్తి గీతాల ఆలాపన, భారత్‌ మాతాకీ జై నినాదాలతో వీధులు హోరెత్తాయి. స్టేడియం చుట్టూ పతాకాన్ని ప్రదర్శించారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts