మారుతీ సుజుకీ స్వీయఛార్జింగ్‌ హైబ్రిడ్‌ కార్లు!
close

Updated : 24/08/2021 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతీ సుజుకీ స్వీయఛార్జింగ్‌ హైబ్రిడ్‌ కార్లు!

టయోటాతో కలిసి అభివృద్ధి

దిల్లీ: దేశంలో విద్యుత్తు వాహనాల విస్తృతికి ప్రధాన ఆటంకం.. ఛార్జింగ్‌ వ్యవస్థలు లేకపోవడమే. అందుకే స్వీయ ఛార్జింగ్‌ (ప్రయాణ సమయంలో బ్యాటరీ వాటంతట అవే ఛార్జ్‌ అయ్యే) హైబ్రిడ్‌ విద్యుత్‌ కార్ల తయారీకి మారుతీ సుజుకీ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. ఇందుకోసం జపాన్‌కు చెందిన టయోటాతో మారుతీ సుజుకీ జట్టుకట్టింది. ‘కొన్ని విద్యుత్తు వాహనాలను సంయుక్తంగా పరీక్షించాల్సి ఉంది. మేము సిద్ధం చేస్తున్న ప్రోటోటైప్‌ వాహనాలను టయోటాతో కలిసి వచ్చే నెలలో  పరీక్షించడాన్ని ప్రారంభిస్తాం. వినియోగదార్ల నుంచి మరిన్ని అభిప్రాయాలు సేకరించే ఉద్దేశంలో ఉన్నాం. దేశంలో ఛార్జింగ్‌ మౌలిక వసతులు పెరిగే వరకు, స్వీయ ఛార్జింగ్‌ యంత్రాలు అవసరమవుతాయి. ఆ దిశగా అడుగు వేసే ఉద్దేశంతో హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహనాలను అభివృద్ధి చేస్తున్నామ’ని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌ ప్లానింగ్‌, ప్రభుత్వ వ్యవహారాలు) రాహుల్‌ భారతీ తెలిపారు. స్వీయ ఛార్జింగ్‌ కార్లలో.. ఇంజిన్‌లు బ్యాటరీలకు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. దీంతో పాటు కారు చక్రాలు తిరగడం వల్ల కూడా విద్యుత్‌ వస్తుంటుంది. రాబోయే 10-15 ఏళ్ల పాటు ఈ వాహనాలకు అధిక గిరాకీ లభిస్తుందని సంస్థ భావిస్తోంది.

* 2020లో యూరోప్‌ సుజుకీ హైబ్రిడ్‌ విద్యుత్తు వాహనం స్వేస్‌ను ఆవిష్కరించింది. టయోటా కొరొల్లా ఎస్టేట్‌ ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు 3.6 కిలోవాట్‌ బ్యాటరీ, 1.8 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉన్న స్వీయఛార్జింగ్‌ వాహనమైన స్వేస్‌ లీటరు ఇంధనంపై 27 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది.

* 2025లో మారుతీ సుజుకీ విద్యుత్తు వాహనాన్ని విడుదల చేస్తుందని సమాచారం.

రూ.200 కోట్ల జరిమానా: సీసీఐ

కార్లు విక్రయించేటప్పుడు డీలర్లు ప్రత్యేక రాయితీలు ప్రకటించకుండా నియంత్రించడంతో పాటు, కంపెనీ చెప్పిన విధంగానే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న మారుతీ సుజుకీ ఇండియా (ఎమ్‌ఎస్‌ఐఎల్‌) తీరును కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తప్పు పట్టింది. డీలర్ల మధ్య పోటీని తగ్గించడం కోసం మారుతీ సుజుకీ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. పోటీతత్వ వ్యాపార నిర్వహణలో ఇది సహేతుకం కాదని అభిప్రాయపడిన సీసీఐ, మారుతీ సుజుకీపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా జమ చేయాలని ఆదేశించింది. డీలర్లు ఇష్టానుసారం కార్ల అమ్మకాలపై రాయితీలు ఇవ్వకుండా ఎమ్‌ఎస్‌ఐఎల్‌ డిస్కౌంట్‌ కంట్రోల్‌ పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరైనా డీలర్లు అదనంగా రాయితీలు ఇవ్వాలంటే కచ్చితంగా కంపెనీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని అతిక్రమిస్తే.. ఆ డీలర్లతో పాటు, కారును విక్రయించిన ఉద్యోగులపైనా జరిమానా విధిస్తోంది. దీనిని గుర్తించేందుకు ఎమ్‌ఎస్‌ఐఎల్‌ ‘మిస్టరీ షాపింగ్‌ ఏజెన్సీ (ఎంఎస్‌ఏ)’లను నియమించి, వినియోగదారులుగా షోరూంలకు వెళ్లి, రాయితీలపై ఆరా తీయిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీలను ఇస్తే.. ఆ డీలర్లను సంజాయిషీ అడుగుతోంది. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే.. జరిమానా చెల్లించాలని పేర్కొంటోంది. ఈ చర్యలు వ్యాపార పోటీతత్వానికి విరుద్ధంగా ఉన్నాయని భావించి, సీసీఐ రూ.200 కోట్ల జరిమానా విధించింది. సీసీఐ ఆదేశాలపై చట్ట పరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని మారుతీ సుజుకీ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని