మనతోపాటే ఇంటికొచ్చే సినిమా ‘జాను’
close
Published : 02/02/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనతోపాటే ఇంటికొచ్చే సినిమా ‘జాను’

హైదరాబాద్‌: శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ హిట్‌ చిత్రం ‘96’కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించగా దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఇటీవల విడుదలైన పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్‌ సైతం విడుదల చేశారు. ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా నటుడు నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఈ చిత్రానికి సంబంధించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


మనతో పాటు ఇంటికొచ్చే సినిమా

నటుడు నాని మాట్లాడుతూ.. ‘96’ను తెలుగులో తీస్తున్నారని తెలిసినప్పటి నుంచి ప్లీజ్‌ ఆ సినిమాను చెడగొట్టకండి అని రాజుగారితో చెప్పాను. చాలా మందితో ఆ సినిమాను రీమేక్‌ చేయడం కరెక్ట్‌ కాదు అని చెప్పాను. అయితే, సినిమాలో సమంత, శర్వానంద్‌ చేస్తున్నారని ప్రకటించిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. ట్రైలర్‌ చూసిన తర్వాత తెలుగులో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనిపిస్తోంది. శర్వానంద్‌ గురించి చెప్పాలంటే.. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తొలి స్నేహితుడు. ఏ సినిమా చేసినా వందశాతం కష్టపడి పని చేస్తాడు. అందుకే సినిమా హిట్టయినా.. ఫట్టయినా.. శర్వానంద్‌కు మాత్రం మంచి పేరు వస్తుందన్నది నిజం. ఈ సినిమాలోనూ ఇరగదీసి ఉంటాడు. ఇక సమంత గురించి చెప్పాలంటే.. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా ఇప్పుడు మేమిద్దరం కలిసి చేస్తే బాగుండేదని నా ఫీలింగ్‌. ఒక సంవత్సరంలో పది మంచి సినిమాలుంటే అందులో రెండు మూడు సినిమాలు సమంతవే ఉంటాయి. కొన్ని సినిమాలు చూసి ఇంటికెళ్లిపోతాం.. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనతోనే వస్తాయి. ఇది కచ్చితంగా థియేటర్‌ నుంచి మీతో పాటే మీ ఇంటికి ‘జాను’ వస్తుంది. ఈ సినిమా కలెక్షన్లతో పాటు సినిమా యూనిట్‌ మొత్తానికి ఎప్పటికీ  గుర్తుండిపోయే సినిమాగా మారుతోందన్న నమ్మకం ఉందన్నారు.


‘జాను’  హ్యాంగ్‌ ఓవర్‌ లాంటిది

దిల్‌రాజు మాట్లాడుతూ.. తమిళంలో ‘96’ చూసిన తర్వాత తెలుగు రీమేక్‌ చేయాలంటే హీరోయిన్‌గా సమంత తప్పితే ఇంకెవరూ చెయ్యలేరని ఫిక్స్‌ అయ్యాను. శర్వానంద్‌కు ఫోన్‌ చేసి సినిమా చూడమని చెప్పాను. తను సినిమా చూసి చాలా బాగుందన్నాడు. వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను. అలా.. సమంత, శర్వానంద్‌ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఈ తర్వాత డైరెక్టర్‌ ప్రేమ్‌.. ఇంతకుముందు మాదగ్గర ఆర్య సినిమాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా చేశాడు. ఒక మంచి డైరెక్టర్‌గా మంచి సినిమాకు కావాల్సిన టీమ్‌ను తయారు చేసుకున్నాడు. ఇక సంగీతం గురించి మాట్లాడాలంటే.. తమిళంలో వచ్చినప్పటి నుంచే ‘‘ఊహలే.. ఊహలే..’’ పాట మన తెలుగువాళ్లు చాలామంది రింగ్‌టోన్లుగా పెట్టుకున్నారు. అంతలా ఆకట్టుకుంది సంగీతం. చాలా సినిమాలు ఆడతాయి.. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే హాంగ్‌ ఓవర్‌గా మారుతాయి. సినిమా థియేటర్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మన కళ్లముందే కదలాడుతుంటాయి. తమిళంలో ఎంత పెద్ద హిట్టయిందో తెలుగులోనూ అంతకంటే పెద్ద హిట్టు అవుతుందని నమ్మకం ఉంది అని అన్నారు.


తెలుగు సినీ చరిత్రలో సమంతకు ప్రత్యేక పేజీలుంటాయి

డైరెక్టర్‌ వంశీపైడిపల్లి మాట్లాడుతూ.. ‘96’ సినిమాను తెలుగులో రాజుగారు చేస్తున్నప్పుడు నేను కూడా అందరిలాగే ‘మీరెందుకు రిస్క్‌ తీసుకుంటున్నార’ని అన్నాను. అయితే, తమిళంలో సినిమా చూసిన తర్వాత ఇంత క్లాసిక్‌ సినిమాను ఎంచుకొని మంచిపని చేశారని చెప్పాను. రాజుగారు సినిమాతో డబ్బుకన్నా మంచిపేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇక సమంత గురించి చెప్పాలంటే సినిమా ఎంచుకునే ముందు.. ఈ సినిమా చేస్తే తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో సమంతకు ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉంటాయి. ఆ విషయం ఆమెతో ఏనాడో చెప్పాను అన్నారు.


ప్రతీది మొదటి సినిమాలాగే భావిస్తా

హీరోయిన్‌ సమంత మాట్లాడుతూ.. మీకు నిరాశ కలిగించకూడదన్న కారణంతోనే నేను ప్రతీ సినిమాకు భయపడతాను. అందుకే నా తొలి సినిమాకు వెళ్లినట్లే సినిమా సెట్‌కు వెళ్తాను. అయితే, ‘జాను’ షూటింగ్‌ సమయంలో బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ సినిమా గురించి దిల్‌రాజు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు భయపడి నేను చేయలేనని చెప్పాను. ఆయన మళ్లీ నాతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. రాజుగారికి ధన్యవాదాలు. చిత్రీకరణ సమయంలో శర్వానంద్‌ ఎంతో సహకరించారు. సినిమా బాగా వచ్చిందంటే దానికి శర్వానంద్‌ కారణం అని పేర్కొన్నారు.


ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు

హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ.. నేను బాగా చేశానని ఎవరైనా అంటే, దానికి కారణం మాత్రం సమంతనే. ఆమెతో సినిమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను ఎంత నేర్చుకున్నా సరే మొదటి సినిమాకు వచ్చినట్లే షూటింగ్‌కు వస్తుంది. ఈ సినిమాలో నేనున్నానంటే దానికి కారణం దిల్‌రాజుగారే. ఇంతమంచి సినిమాలో నాకు అవకాశం కల్పించినందుకు థాంక్స్‌. సినిమా చూస్తున్నప్పుడు.. అరె.. ఈ పాత్ర అచ్చం నాలాగే ఉందే అని కచ్చితంగా అనిపిస్తుంది. స్కూల్‌ పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారని తెలిపారు. మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని