కరోనా కట్టడిలో ఈ నగరాలు ఆదర్శం..!
close
Published : 25/05/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కట్టడిలో ఈ నగరాలు ఆదర్శం..!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదులో సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదవుతున్నాయి. ఈ రోజు ఏకంగా 6,977 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా కేంద్రం వివిధ నగరాల యంత్రాంగాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతోంది. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ను నిలువరించడంలో నాలుగు నగరాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు గుర్తించింది.

కేసుల్ని ఎదుర్కోవడంలో..

ప్రధానంగా రెండు అంశాల్లో నగరాల పనితీరును అంచనా వేశారు. అందులో ఒకటి ఎక్కువ కేసుల్ని ఎదుర్కోవడానికి అవలంబిస్తున్న విధానాలు కాగా.. మరొకటి మరణాల రేటును భారీగా కుదించడం. జైపుర్‌, ఇండోర్‌ నగరాలు కేసుల్ని అదుపు చేయడంలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నట్లు కేంద్రం గుర్తించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నగరాల్లో ఇంటింటి సర్వే విస్తృతంగా, వేగంగా నిర్వహిస్తున్నారు. తద్వారా అనుమానితుల్ని, వారితో కలిసిన వారిని గుర్తించడం చాలా సులభం అవుతోంది. ఇక ఇండోర్‌లో ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం బస్తీల్లో తిరుగుతూ అనుమానితుల్ని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జైపుర్‌లో కూరగాయలు విక్రయించేవారిని ప్రత్యేక ప్రాంతాలకు పరిమితం చేశారు. అలాగే కిరాణా కొట్లు, పాల కేంద్రాల వద్ద స్థానిక యంత్రాంగం, పోలీసులు నిరంతర నిఘా వేసి ఉంచుతోంది. తగిన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించేలా చూస్తున్నారు.

మరణాల రేటు తగ్గించడంలో..

ఇక మరణాల రేటును తగ్గించడంలో చెన్నై, బెంగళూరు సమర్థంగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసులు అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ.. మరణాల రేటు మాత్రం గణనీయంగా తగ్గించారు. ఇక్కడ మరణాల రేటు కేవలం ఒక శాతం మాత్రమే. దేశ సగటు కంటే ఇది తక్కువ. ముఖ్యంగా వెంటిలేటర్లను చాలా సమర్థంగా వినియోగించుకుంటున్నారు. రోగులకు చికిత్స అందించడంలోనూ తీవ్రతను బట్టి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే వారు కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల్లోనూ నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని