ఇక్కడి స్టార్లు.. అక్కడివాళ్లు! - thease bollywood superstars who are not indian citizens
close
Published : 16/02/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక్కడి స్టార్లు.. అక్కడివాళ్లు!

తెరను ఏలే నటులంటే మనకి తెరవేల్పులే... గుండెల్లో పెట్టుకొని మావాళ్లు అనుకుంటాం... అభిమానం ఎక్కువైతే గుళ్లూ కట్టేస్తాం... తెరమరుగైనా మనవాళ్లనుకుంటే బ్రహ్మరథం పట్టేస్తాం...భారతీయ ఫ్యాన్స్‌ అభిమానం ఆ స్థాయిలో ఉంటుంది మరి! కానీ మీకో విషయం తెలుసా? ఇక్కడ స్టార్‌ నటులుగా చెలామణిలో ఉన్న కొందరు విదేశీయులు... భారతీయ మూలాలున్నా వారి పౌరసత్వం ఇక్కడిది కాదు...ఫారిన్‌ సిటిజన్‌షిప్‌ ఉన్న కొందరి స్టార్ల వివరాలివి.

కెనడా ఖిలాడీ.. అక్షయ్‌ కుమార్‌

బాలీవుడ్‌ ఫైటింగ్‌ల హీరో అక్షయ్‌కుమార్‌కి భారత్‌లో వీరాభిమానులున్నారు. అయినా అతడు ఇండియన్‌ కాదంటే మీరు నమ్మగలరా? అక్కీ అసలు పేరు రాజీవ్‌ హరి ఓం భాటియా. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టాడు. దిల్లీలో పెరిగాడు. 2011లో కెనడా ప్రభుత్వం తనకి ఆ దేశ గౌరవ పౌరసత్వం ఇవ్వడంతో ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ని వదులుకున్నాడు. అతడి చర్యను చాలామంది వ్యతిరేకించారు. ‘బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఉంటూ ఈ దేశ పౌరసత్వాన్ని ఎలా వదులుకుంటావు?’ అని. అప్పట్నుంచి అక్షయ్‌ మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఏడాది కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాననీ వివరణ ఇచ్చినా ఇప్పటికీ అతడి దగ్గరుంది కెనడా పాస్‌పోర్టే.

బ్రిటీష్‌ అమ్మడు అలియా భట్‌

బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో హీరోయిన్లలో అలియా ఒకరు. తను జగమెరిగిన దర్శకుడు మహేశ్‌ భట్‌ కూతురు. ముంబయిలోని పోష్‌ ఏరియా జుహూలో ఓ సొంతింటిదారు కూడా. అయినా తను బ్రిటీష్‌ పౌరురాలు. ఎందుకంటే అలియా తల్లి సోనీ రజ్దాన్‌ మూలాలు బ్రిటన్‌లోనే ఉన్నాయి. ఆ రకంగా వచ్చిన బ్రిటీష్‌ పౌరసత్వాన్ని ఎప్పుడూ వదులుకునే ప్రయత్నం చేయలేదు ఈ లేత భామ. భారతీయ సిటిజన్‌షిప్‌ కోసం దరఖాస్తు కూడా చేయలేదు.

అమెరికా అబ్బాయి ఇమ్రాన్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్‌. పలు సినిమాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక్కడి అమ్మాయి అవంతికా మాలిక్‌ని పెళ్లాడాడు. ఏళ్లకొద్దీ ఇక్కడే ఉంటున్నా తను అమెరికన్‌ సిటిజన్‌. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో జన్మించాడు. తల్లిదండ్రులు విడిపోయాక, అమెరికా నుంచి తల్లితో కలిసి వచ్చి ముంబయి వచ్చి స్థిరపడ్డాడు. ఇమ్రాన్‌ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం అక్కడి సిటిజన్‌షిప్‌ వదులుకోవాలంటే పదేళ్ల పన్నులు ముందుగానే చెల్లించాలి. ఆ భారాన్ని భరించలేక ఇంకా అమెరికా పాస్‌పోర్ట్‌తోనే వెళ్లదీస్తున్నాడు.

లండన్‌ భామ కత్రినా కైఫ్‌

కత్తిలాంటి కత్రినా లండన్‌ నుంచి నేరుగా బాలీవుడ్‌లో దిగిపోయిందనే సంగతి అందరికీ తెలిసిందే. తను భారతీయ కశ్మీరీ మూలాలున్న తండ్రికి, బ్రిటీష్‌ లాయరైన సుజానే టర్కోట్‌కి హాంకాంగ్‌లో జన్మించింది. సుజానే లాయరే కాదు.. స్వచ్ఛంద కార్యకర్త. హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లతోపాటు యూరోప్‌లోని చాలా దేశాల్లో పనిచేసి బ్రిటన్‌లో స్థిరపడింది. అక్కడే మోడలింగ్‌ మొదలుపెట్టింది కత్రినా. ఓ మోడలింగ్‌ షోకి హాజరైన దర్శకుడు కైజాద్‌ గుస్తాద్‌ బాలీవుడ్‌కి ఆహ్వానించాడు. అలా ముంబయిలో అడుగుపెట్టి, కొన్నాళ్లకే స్టార్‌ హోదా సంపాదించుకుంది. ముంబయిలో ఓ ఇల్లు కొనుక్కున్నా బిట్రీష్‌ పౌరసత్వాన్ని కొనసాగిస్తోంది.

శ్రీలంక అందం జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

బాలీవుడ్‌ని తన సొంతం చేసుకున్నా, ఇప్పటికీ ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ లేని హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. 2006లో మిస్‌ యూనివర్స్‌ శ్రీలంక అందాల కిరీటం దక్కించుకున్న జాక్వెలిన్‌ ఎప్పటికైనా హాలీవుడ్‌ స్టార్‌ కావాలనుకుంది. మొదటి అడుగుగా హిందీ సినిమాల్లోకి వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ ప్రోత్సాహంతో ఇక్కడే సెటిలైంది. కెనడా, శ్రీలంక, మలేసియా మూలాలున్న ఫెర్నాండెజ్‌ ఇప్పటికీ శ్రీలంక పౌరురాలే.

కెనడా అందమే సన్నీ లియోని

ఒకప్పటి శృంగార తార, బాలీవుడ్‌ హాట్‌ గర్ల్‌ సన్నీ లియోని భారతీయురాలు కాదనే సంగతి చాలామందికి తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్‌జిత్‌ కౌర్‌ వోహ్రా. కెనడాలో స్థిరపడ్డ పంజాబీ వ్యాపారవేత్త కూతురు. అక్కడే పోర్న్‌ ఇండస్ట్రీలో స్థిరపడి, ఆ రంగంలో ఉన్న అమెరికన్‌ డానియెల్‌ వెబర్‌ని పెళ్లాడింది. బిగ్‌ బాస్‌ రియాలిటీ షోతో పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడికొచ్చి తొమ్మిదేళ్లు గడిచినా కెనడా పౌరసత్వమే కొనసాగిస్తోంది.

అమీ జాక్సన్‌

ఏమాత్రం భారతీ మూలాలు లేని అచ్చమైన విదేశీ సుందరి అమీ జాక్సన్‌. పదేళ్ల కిందట తను ‘టీన్‌ గ్రేట్‌ బ్రిటన్‌’ కిరీటం గెల్చుకుంది. అప్పుడే ‘మద్రాస పట్టిణం’లో ఓ బ్రిటీష్‌ దొరసాని పాత్ర కోసం వెతుకుతున్న దర్శకుడి కళ్లలో పడింది. అలా చెన్నై చేరిన ఈ అందం తర్వాత మరికొన్ని తమిళ సినిమాల్లో నటించింది. అక్షయ్‌కుమార్‌కి జోడీగా చేసిన ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’తో స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. పదేళ్లుగా భారతీయ సినిమాలపైనే దృష్టి పెడుతూ దూసుకెళ్తోంది. సినిమా షూటింగ్‌ల కోసం లండన్‌, ఇండియా మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నా బ్రిటీష్‌ పాస్‌పోర్టునే మాత్రమే వాడుతోంది.

వీళ్లదీ అదేబాట

* సారా జన్‌ డయాస్‌- ఒమన్‌

* బార్బరా మోరీ- మెక్సికన్‌, ఉరుగ్వేయిన్‌

* సప్నా పబ్బీ- బ్రిటీష్‌

* అలీ జాఫర్‌- పాకిస్థానీ

* ఎవ్లీన్‌ శర్మ- జర్మన్‌

* నర్గీస్‌ ఫక్రీ- అమెరికన్‌

* ఫవాద్‌ ఖాన్‌- పాకిస్థానీ 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని