పెళ్లి పేరుతో నగదు కాజేసిన వ్యక్తి అరెస్ట్‌
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

పెళ్లి పేరుతో నగదు కాజేసిన వ్యక్తి అరెస్ట్‌

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వత్సవాయి మండలంలో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయడంతో పాటు ఆమె పోగొట్టుకున్న రూ.12 లక్షల నగదును రికవరీ చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. జగ్గయ్యపేట స్టేషన్లో శుక్రవారం ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మేరేజ్‌ బ్యూరో సైట్‌లో మారు పేరుతో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించిన విజయవాడకు చెందిన పొట్టూరి బాలవంశీకృష్ణ వత్సవాయి మండలానికి చెందిన ఓ యువతితో వివాహ సంప్రదింపులు జరిపాడు. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. ఆమెను అమెరికా తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలు కావాలని చెప్పి కీలక పత్రాలను, వ్యక్తిగత వివరాలను అంతర్జాలం ద్వారా తెప్పించుకున్నాడు. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమె నుంచి రూ.12.77 లక్షల నగదును పలు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తరువాత మోసపోయినట్లు తెలుసుకున్న ఆమె వత్సవాయి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందం పరిశోధించి బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అప్పటికే అతను అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుసుకున్నారు. రిమాండ్‌లో ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాక వత్సవాయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.10.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు పరిశోధనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ చినబాబు, కానిస్టేబుల్‌ కె.సురేష్‌కుమార్‌, ఎస్‌పీఓలను రివార్డులిచ్చి అభినందించారు. కీలక పత్రాలు, బ్యాంకు ఖాతా నెంబర్లు, ఓటీపీలు అపరిచితులతో పంచుకోవద్దని, సైబర్‌ నేరానికి గురైతే 155260 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ఎస్పీ సూచించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని