లెక్కింపు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయండి
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

లెక్కింపు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయండి


గుంటూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి సూచనలు చేస్తున్న ఎస్‌ఈసీ
నీలం సాహ్ని, చిత్రంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్‌లోని వీసీ హాలులో శనివారం ఓట్ల లెక్కింపుపై జిల్లా ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓట్ల లెక్కింపునకు తక్కువ సమయం ఉన్నందున యంత్రాంగం మొత్తాన్ని ప్రక్రియలో భాగస్వాములను చేయాలన్నారు. చెల్లుబాటు అయ్యే ఓటు, చెల్లని ఓటుపై కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు పూర్తయ్యాక తుది ఫలితాలు వెలువడే సమయంలో అంకెల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూంల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివరాలను ఎస్‌ఈసీకి వివరించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని కౌంటింగ్‌ కేంద్రమైన ఏఎల్‌ బీఈడీ కళాశాలను నీలం సాహ్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ, గుంటూరు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆరీఫ్‌ హఫీజ్‌, విశాల్‌గున్నీ, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి, డీఆర్‌వో పి.కొండయ్య పాల్గొన్నారు.

ఊరేగింపులకు అనుమతులు లేవు: ఎస్పీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం, ఫలితాలు వెలువడ్డాక ఊరేగింపులు, విజయోత్సవ ప్రదర్శనలకు అనుమతులు లేవని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శనివారం ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏర్పాట్లపై సమీక్ష

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జడ్పీ సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, రిటర్నింగ్‌ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. జిల్లా పరిషత్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ని ప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని