నిఘా వైఫల్యం..!
eenadu telugu news
Updated : 20/10/2021 06:23 IST

నిఘా వైఫల్యం..!

ప్రముఖుల నివాస ప్రాంతాల్లో భద్రత లోపం

యథేేచ్ఛగా అరాచకమూకల సంచారం

పట్టాభి కుటుంబాన్ని పరామర్శిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, విజయవాడ: అది ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతం.. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతలు.. పారిశ్రామిక వేత్తలు ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటారు.. అలాంటి కాలనీలో అరాచకమూకలు చెలరేగడంపై కాలనీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి కాదు.. వరసగా మూడు ఘటనలు జరగడం.. పోలీసుల భద్రత వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. గురునానక్‌కాలనీ, భారతీనగర్‌ కాలనీలు పక్కపక్కనే ఉంటాయి. పక్కా ప్రణాళికతో నిర్మాణం చేసిన కాలనీలు ఇవి. విశాల రహదారులు, పచ్చదనం, అందమైన భవంతులు ఉంటాయి. అలాంటి కాలనీలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నివాసం ఉంటున్నారు. ఆయన నివాసంపై అరాచకమూకలు దాడి చేయడం ఇది మూడోసారి. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. కనీసం కాలనీలో గస్తీని పెంచలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు నివాసం ఉండే కాలనీలోనే భద్రత కరవైతే.. ఇక సాధారణ కాలనీల్లో నివాసం ఉండేవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పట్టాభి నివాసానికి వచ్చిన తెదేపా నేతలు గద్దె అనూరాధ, నాగుల్‌మీరా తదితరులు

దర్యాప్తు ఏదీ..?
తెదేపా నేత పట్టాభి మొదట విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవారు. హోటల్స్‌ అసోసియేషన్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. తర్వాత అధికార ప్రతినిధిగా నియమించిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పారు. ఘాటుగా అనర్గళంగా విమర్శలు చేస్తున్నారు. టీవీ చర్చల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ లొసుగులు, కొన్ని అవినీతి అక్రమాలను మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయన ప్రత్యర్థులకు లక్ష్యంగా మారారు. తొలిసారి అక్టోబరు 2019లో ఆయన కారును ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న కారును తెల్లవారుజామున 4గంటలకు అరాచకమూకలు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనాడే పట్టాభి అనుమానం వ్యక్తం చేశారు. తనపై దాడి జరగవచ్చని ఆందోళన చెందారు. తన ఇంటి పక్కనే హైకోర్టు న్యాయమూర్తి నివాసం ఉంది. సరిగ్గా రెండేళ్లు అయినా కారు ధ్వంసం చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ  కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. తెల్లవారుజామున కాలనీలో ప్రవేశించిన వ్యక్తులను ఆరా తీస్తే సమాచారం తెలిసేదని తెదేపా నేతలు అంటున్నారు. కానీ కారు అద్దాలు ధ్వంసం చేశారని చాలా తేలిగ్గా పోలీసులు తీసుకున్నారు. దాని తర్వాత 2021 ఫిబ్రవరిలో పట్టాభిపై దాడి జరిగింది. ఆయన కారులో పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరగా మలుపు తిరిగిన వెంటనే ఆయన కారుపై అగంతకులు దాడి చేశారు. రాడ్లు తీసుకుని అద్దాలు ధ్వంసం చేయడంతో కారులో కూర్చున పట్టాభికి గాయాలయ్యాయి. నాడు వైకాపా కార్యకర్తలుగా అనుమానించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. వైకాపా దాడిలో ఆయన తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. నాడు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ వ్యక్తిగత భద్రత సిబ్బందిని ఇవ్వలేదు. ఇంటి వద్ద కాపలా కూడా పెట్టలేదు. రాత్రి పూట గస్తీ నిర్వహిస్తామని చెప్పారు. అది మూడు రోజుల ముచ్చట అయింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తం దాడిలో పది మంది పాల్గొన్నట్లు తేలినా ఆరుగురి అరెస్టుతో మమ అనిపించారు. ఈ దాడికి ప్రణాళిక రూపొందించిన అసలు సూత్రధారులను అరెస్టు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. నాటి ఘటనలో ఆనంద్‌, వెంకటేష్‌, భాగ్యరాజు, భాస్కరరావు, సత్యనారాయణ, తులసీ రాంలను అరెస్టు చేశారు. వీరంతా గుణదల ప్రాంతానికి చెందిన వారు. ఈ దాడికి ఓ ముఖ్యనేత ప్రణాళిక రచించినట్లు ప్రచారం జరిగింది. దీని తర్వాత మళ్లీ మూడోసారి పట్టాభి నివాసంపై దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఉన్నారనే సమాచారంతోనే మూకుమ్మడి దాడి చేశారు.

ధ్వంసమైన సీసీటీవీ, హార్డ్‌ డిస్క్‌లను పరిశీలిస్తూ..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని