మద్దతు ధర కల్పనపై  ప్రభుత్వానికి నివేదిక
eenadu telugu news
Updated : 19/10/2021 06:00 IST

మద్దతు ధర కల్పనపై  ప్రభుత్వానికి నివేదిక


గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తదితరులు

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పనపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి, వేరుసెనగ, టమోటా, మామిడి పంటకు మద్దతు ధరతో పాటు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై పంపిణీ చేయాలని రైతుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రబీకి సంబంధించి నవంబరులో లేపాక్షి, కే6, నారాయణి రకం వేరుసెనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ చాలా చెరువులు నిండలేదని, లింకేజీ కాలువలను వెంటనే శుభ్రం చేయాలని సూచించారు. మండలి ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లకుండా ఆర్‌బీకేల ద్వారా రైతులకు సలహాలు అందించాలని, రెయిన్‌గన్స్‌ ద్వారా మందులు స్ప్రే చేయాలన్నారు. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యాన పంటలకు వినియోగించే/వినియోగించకూడని ఎరువుల జాబితాను ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేయాలన్నారు. జేడీఏ దొరసాని మాట్లాడుతూ ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, ఎన్‌డీఎల్‌ఆర్‌ 7, ఎంటియూ 1224 రకం వరి విత్తనాలను ప్రతిపాదిస్తున్నామని, జంతువుల నుంచి పంటల్ని కాపాడేందుకు స్కారీ, సౌరదీపాల మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రిప్‌ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారిణి ఇందుమతి మాట్లాడుతూ నిధులు విడుదల కాకపోవడంతో కుప్పంలో రూ.5 కోట్లతో శీతలీకరణ కేంద్ర నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జేసీ రాజాబాబు, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకట్రావు పాల్గొన్నారు. ఉద్యాన శాఖ నేతృత్వంలో రూపొందించిన ‘మామిడిలో సమగ్ర సస్యరక్షణ-మామిడిలో వాడవలసిన పురుగు మందులు’ గోడపత్రాలను జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు ఆవిష్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని