Published : 09/05/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేలుళ్ల ప్రదేశాన్ని సందర్శించిన తెదేపా బృందం

కలసపాడు: మండలంలోని మామిళ్లపల్లె సమీపంలో తిరుమల కొండ వద్ద ఉన్న ముగ్గురాళ్ల గనుల్లో జరిగిన పేలుళ్ల ప్రదేశాన్ని ఆదివారం కడప తెదేపా పార్లమెంటరీ ఇన్‌ఛార్జి మల్లెల లింగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక ప్రధాన కార్యదర్శి రెడ్డం వెంకటసుబ్బారెడ్డి తదితరులు సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం విలేకర్లతో మాట్లాడారు. అక్రమంగా మైనింగ్‌ చేస్తూ పదిమంది ప్రాణాలు నిలువునా బలిగొన్నారన్నారు. దీనికి బాధ్యుడైన బ్రహ్మంగారి మఠానికి చెందిన వైకాపా నాయకుడు నాగేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిలిటెన్ స్టిక్స్‌(పేలుడు పదార్థాలు) అన్‌లోడ్‌ చేసే సమయంలో పేలుళ్లు సంభవించి 10మంది మృతి చెందినట్లు తెలిసిందన్నారు.

వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. 2020లో నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులు కూడా అందజేశారన్నారు. అక్రమ మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు లేనట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిందని వివరించారు. పులివెందుల నియోజకవర్గంలోని ఆరుగురు ఈ ఘటనలో మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పార్టీ మారలేదని తనకు చెందిన మైనింగ్‌కు రూ.వందల కోట్ల జరిమానా విధించి మూయించారని ఆరోపించారు. కార్యక్రమంలో బద్వేల్‌ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ రంతు, సర్పంచి సుధాకర్, నాయకులు సీతా వెంకటసుబ్బయ్య, కొండారెడ్డి, రసూల్‌ తదితరులు పాల్గొన్నారు. 

బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..

కడప నుంచి వచ్చిన బాంబ్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొన్ని నమూనాలను సేకరించి తమ వెంట తీసుకెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని