రానున్న 45రోజులు అత్యంత కీలకం: జగన్‌

తాజా వార్తలు

Updated : 07/04/2021 21:48 IST

రానున్న 45రోజులు అత్యంత కీలకం: జగన్‌

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

అమరావతి: పోలవరం ప్రాజెక్టులోని కాపర్ డ్యాంలో ఖాళీలను వేగంగా పూడ్చి వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, గేట్లు, మెయిన్‌ డ్యాం తదితర కీలకమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులనూ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం పనులపై అధికారులు సీఎంకు వివరించారు.

స్పిల్‌ ఛానల్‌లో మట్టి, కాంక్రీట్ పనుల తవ్వకాలను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకమని.. వర్షాలు వచ్చేలోపు వేగంగా, సమర్థంగా పనులు జరగాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అప్రోచ్‌ ఛానల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని.. అవి కూడా మే నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో కరవు నివారణ కింద చేపట్టనున్న ప్రాజెక్టుల పనులపైనా సీఎం సమీక్షించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం.. ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోల్చితే.. ఈ 18 నెలల కాలంలో పనులు చాలా వేగంగా ముందుకు సాగాయని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తైన తర్వాత మహేంద్రతనయ, మడ్డువలస ఫేజ్-2, తారకరామసాగర్‌ తదితర ప్రాజెక్టుల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని