close

తాజా వార్తలు

Published : 04/12/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఫేక్‌ ముఖ్యమంత్రని.. పూర్తి అసహనంతో వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, ఎదురుదాడి చేయడం వైకాపాకు పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. అసెంబ్లీలో ఈరోజు జరిగిన పరిణామాలపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఫేక్‌ మీడియాతో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా?అని ప్రశ్నించారు.

‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక పింఛన్లను భారీగా తగ్గించింది. ఆ విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలకు పూర్తిగా పింఛన్లు తొలగించారు. తెదేపా హయాంలో 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ చెప్పారు. కానీ మేం 50.29 లక్షల పింఛన్లు అందించాం. పింఛన్‌ అందించే విషయంలో నిమిషానికొక మాట మాట్లాడున్న సీఎం, ప్రజలను మోసం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రూ.35 పింఛన్‌ ఇస్తే.. అది నేను రూ.75 చేశాను. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అవగానే దాన్ని రూ.200 చేశారు. అంటే రూ.125 పెంచారు. ఈ విషయాన్ని 12,500 సార్లు ప్రస్తావించారు. అనంతరం తెదేపా హయాంలో రూ.2000 పింఛన్‌ ఇచ్చాం. ఇవాళ తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే దాన్ని రూ.3వేలు చేసేవాళ్లం. ఏటా పింఛన్లు పెంచుకుంటూ వెళ్తామని చెప్పిన వైకాపా.. ఈ ఏడాది ఇవ్వాల్సిన పింఛన్‌ను వచ్చే ఏడాది ఇస్తామంటున్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

‘‘అసెంబ్లీలో పింఛన్లపై తెదేపా లేవనెత్తితే వైకాపా నేతలు విరుచుకుపడ్డారు. ఒక తెదేపా సభ్యుడు మాట్లాడితే.. పది మంది వైకాపా సభ్యులు ఎదురుదాడికి దిగారు. తప్పుడు సమాచారం చెబుతూ అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది ఏమాత్రం సరైంది కాదు. ఏం మాట్లాడినా చెల్లుతుందని అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. తెదేపా నేతలు అసెంబ్లీకి రాకూడదని మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఏమైనా వారి జాగీరా? ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో కాకుండా ఎక్కడో వేరే కార్యక్రమంలో ఉన్నాను. ఏదో విషయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలంటూ వైఎస్సార్‌ అడ్డంగా కూర్చున్నారు. స్పందించి.. బాధ్యత కలిగిన సీఎంగా అసెంబ్లీకి వచ్చాను. నువ్వెవరివి అని ఆరోజు నేను అడగలేదు. అది ప్రజా సేవలో ఉండే బాధ్యత, ఉద్యోగ ధర్మంలా భావించాను. మరి మొన్న వైకాపా ఏం చేసింది. సభను వాయిదా వేసింది. చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎందుకింత గర్వం?నాసిరకంగా వ్యవహరిస్తూ అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. నోరు తెరిస్తే చాలు.. మూయించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఆయన ఎలాంటి అవగాహన లేనటువంటి జీరో సీఎం. ఇవన్నీ చూశాకైనా రాష్ట్ర ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని