close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా ప్రళయ గర్జన

ఒక్కరోజులో 2,61,500 కేసులు.. 1,501 మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి విశృంఖలంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. 24 గంటల్లో 2,61,500 కొత్త కేసులు.. 1,501 మరణాలు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే కేసులు 11.42%, మరణాలు 11.93% పెరిగాయి. 18 రాష్ట్రాల్లో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 1,47,88,109కి.. మరణాల సంఖ్య 1,77,150కి చేరింది.
మహారాష్ట్రలో 24 గంటల్లో 419 మంది కొవిడ్‌ బాధితులు మృతిచెందారు. మరణాల సంఖ్యలో దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.
దేశంలో క్రియాశీలక కేసులు ఒక్క రోజులో 1,21,576 పెరగడంతో వాటి మొత్తం సంఖ్య 18,01,316 (12.18%)కి చేరింది.
24 గంటల్లో 1,38,423 మంది కోలుకోగా కొత్త కేసుల సంఖ్య భారీగా ఉండటంతో రికవరీ రేటు 86.62 శాతానికి పడిపోయింది. ఇంతవరకు మొత్తం కోటీ 28 లక్షల మందికి పైగా కోలుకున్నారు.
దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా 24 గంటల్లో పాజిటివిటీ రేటు 16.69% నమోదైంది. ఏప్రిల్‌ 6న ఇది 8% కాగా 12 రోజుల్లోనే రెట్టింపైంది. దేశంలో వారం సగటు పాజిటివిటీ రేటు మార్చి 11-17 తేదీల మధ్య 3.05% ఉండేది. దేశంలో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో వారపు పాజిటివిటీ రేటు 30.38%గా ఉంది.
92 రోజుల్లో 12 కోట్ల టీకా డోసులు
దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన 92 రోజుల్లో మొత్తం 12.26 కోట్లకు పైగా టీకా డోసులు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. 12 కోట్ల డోసులు వేయడానికి అమెరికాలో 97, చైనాలో 108 రోజులు పట్టడం గమనార్హం.

టీకాలకు వెళ్లేందుకు అంతరాయాలు వద్దు

దిల్లీ: కరోనా దృష్ట్యా విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా టీకాల కార్యక్రమానికి అంతరాయం కలగకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి మనోహర్‌ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.

ఇక ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’

కొద్ది రోజుల్లో ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ను నడపనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం తెలిపింది. మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైలు ద్వారా డిమాండ్‌ ఉన్నచోటుకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఖాళీ ట్యాంకర్లు ముంబయి సమీపం నుంచి సోమవారం బయల్దేరి వైజాగ్‌, జంషెడ్‌పుర్‌, రవుర్కెలా, బొకారోల నుంచి ద్రవ రూప ఆక్సిజన్‌ను నింపుతాయని చెప్పారు.
గతేడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకలు ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారీ అదే తరహా సాయం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వివిధ శాఖలను కోరారు. ఈ మేరకు రక్షణ, రైల్వే, ఉక్కు, బొగ్గు, విద్యుత్తు, నౌకాయానం, విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. వీలైనచోట్ల ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, లేబొరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు.
బిహార్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుందని ముఖ్యమంత్రి నీతిశ్‌ కుమార్‌ ప్రకటించారు. విద్యాసంస్థల మూసివేతను మే 15 వరకు పొడిగించారు.
కొవిడ్‌ టీకాలు, మందులు, ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తగినంతగా సరఫరా చేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ రాశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు