ముందడుగు వేద్దాం

ప్రధానాంశాలు

ముందడుగు వేద్దాం

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన
సవరణలు వచ్చే వరకు ఆగుదామన్న ఆంధ్రప్రదేశ్‌
సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకాని తెలంగాణ
ఈనాడు - హైదరాబాద్‌

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణకు శ్రీకారం చుడదామని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సూచించగా, అందులో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అవి జరిగాక ముందడుగు వేద్దామని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయపడింది. బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు సమన్వయ కమిటీల సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించాయి.  తెలంగాణ దీనికి హాజరుకాలేదు.
గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత గడువులోగా సిబ్బంది, ప్రాజెక్టుల వివరాలు, నిధులు, కేంద్ర బలగాల నియామకం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ సమావేశంలో కోరాయి. అయితే నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులోని ప్రాజెక్టులపై కొన్ని అభ్యంతరాలున్నాయని,  ఇందుకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాస్తామని ఆంధ్రప్రదేశ్‌ సమాధానమిచ్చింది. ఏయే అంశాల్లో, ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలని కోరుకుంటున్నారని బోర్డు అధికారులు ప్రశ్నించగా, వివరాలను ప్రస్తుతం చెప్పలేమని, ఉన్నతాధికారులు, న్యాయబృందం, ముఖ్యమంత్రితో చర్చించాకే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండే, సభ్యులు కుట్యాల, వెంకటసుబ్బయ్య, కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శి డి.ఎం.రాయిపురే, సభ్యులు ఎల్‌.బి.ముతుంగ్‌, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పరిపాలనా విభాగం ఇ.ఎన్‌.సి. సతీష్‌కుమార్‌, జెన్‌కో ఎండీ శ్రీధర్‌, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం ప్రత్యేక అధికారి వీరశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, సమన్వయ కమిటీ సమావేశం తర్వాత  నిర్వహిస్తామని బోర్డు సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాలేదు.

గెజిట్‌ అంశాలపై ప్రజంటేషన్‌
బోర్డు కార్యాలయాలతోపాటు తెలంగాణ నీటిపారుదల, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ల కార్యాలయాలు కూడా జలసౌధ భవనంలోనే ఉన్నాయి. చివరికి రెండు బోర్డులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులతోనే చర్చించాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై మొదట బోర్డులు ప్రజంటేషన్‌ ఇచ్చాయి. నోటిఫికేషన్‌లోని అంశాలను అమలులోకి తేవడానికి ఏమేం చేయాల్సి ఉంది? ఏ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై బోర్డు సభ్య కార్యదర్శులు వివరించారు. ఆగస్టు 15లోగా ప్రాజెక్టుల వారీగా సిబ్బందికి సంబంధించిన వివరాలు అందజేయాలని, నెలలోగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ డిపాజిట్‌ చేయడం గురించి  నిర్ణయం చెప్పాలని బోర్డు అధికారులు కోరారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను తాము స్వాగతించినా కొన్ని మార్పులు చేయాలని కోరనున్నామని,  ఇవి జరిగిన తర్వాత కార్యాచరణపై ముందుకు వెళ్దామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి  పేర్కొన్నట్లు తెలిసింది. సవరణలు వచ్చే వరకు ప్రస్తుత గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో ఉన్నట్లే కాబట్టి  అప్పటివరకు దీని ప్రకారమే ముందుకెళ్దామని బోర్డు అధికారులు సూచించారు. అయితే ‘బోర్డుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ఏడేళ్లు ఎదురుచూశాం, ఇందులో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి సవరణలు చేయాల్సి ఉంది, ఇది జరిగాక పూర్తి స్థాయిలో అమలు చేస్తే సరిపోతుంది’ అని ఏపీ చెప్పినట్లు సమాచారం. గోదావరిలో దిగువన ఉన్న, ఏ రాష్ట్రంతో సంబంధం లేని సీలేరు జల విద్యుత్తు కేంద్రాన్ని బోర్డు పరిధిలో చేర్చడం గురించి ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తమ్మీద ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తి దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్‌ చెప్పింది. సమన్వయ కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ తరఫున నోడల్‌ అధికారిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డిని నియమిస్తున్నట్లు రెండు బోర్డులకు సమాచారమిచ్చింది.


కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

మన్వయ కమిటీ సమావేశానికి ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును కోరిన తెలంగాణ, ఇదే అంశంపై మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అత్యవసరంగా అయినా ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తూ బోర్డు కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ లేఖ రాశారు. అయితే మంగళవారమే రెండు బోర్డులు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి.


ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బోర్డులకు సమాచారం   

ఆంధ్రప్రదేశ్‌ ఇ.ఎన్‌.సి. నారాయణరెడ్డి

ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి అనుగుణంగా బోర్డులు కోరిన సమాచారం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇ.ఎన్‌.సి.) నారాయణరెడ్డి తెలిపారు.సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాల్లో అభ్యంతరాలున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పామన్నారు.బోర్డులపై ఎక్కువ భారం అవసరం లేదని, సాధారణ అంశాలు కాకుండా క్లిష్టమైన అంశాలనే బోర్డులు చూడటం మేలన్నారు. తెలంగాణ నుంచి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో తెలియదని, తాము మాత్రం నిబంధనలు, నియమాలను గౌరవిస్తామని  తెలిపారు. గోదావరిలో ఎలాంటి సమస్యలు లేవు కదా బోర్డు పరిధిలోకి ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నారు. 2004లో వాప్కోస్‌ అధ్యయనం ప్రకారం గోదావరిలో 1430 టీఎంసీల నీటి లభ్యత ఉంటే , వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న , కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కింద తెలంగాణలో 1355 టీఎంసీల నీటి వినియోగం జరగనుందన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గోదావరి డెల్టా, పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సముద్రానికి పోయే నీళ్లంతా మనవి కాదని, భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపులకు తగ్గట్లుగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే నీటి లభ్యత తగ్గుతుందన్నారు.  అందరూ వాడుకోగా మిగిలినవే దిగువకు వస్తాయని, సముద్రానికి పోయే నీటిని తాము మళ్లించుకోవడం తప్పుకాదు కదా? అని ప్రశ్నించారు. సముద్రంలోకి పోయినా ఫర్వాలేదు, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవద్దని తెలంగాణ అంటోందన్నారు. గోదావరి నుంచి మళ్లించే 45 టీఎంసీలలో తెలంగాణ వాటా గురించి ప్రశ్నించగా, తెలంగాణ కూడా గోదావరి నుంచి కృష్ణాలోకి 212 టీఎంసీలు మళ్లిస్తోందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని