close

తాజా వార్తలు

ఆ సినిమా హిట్‌ అయినా అవకాశాలు రాలేదు

మరో జన్మంటూ ఉంటే ఆమె కడుపునే పుడతా

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన నటుడు నరేశ్‌. ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించే కామెడీ చిత్రాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. యువ కథానాయకుడు కార్తికేయతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘గుణ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హీరో కార్తికేయతో వచ్చి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా...

ఒకప్పుడు హీరోగా ఎంత పేరు వచ్చిందో.. ఇప్పుడు నటుడిగా అంతే పేరు వచ్చింది? ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారు?
నరేశ్‌: ‘టైమింగ్‌ వచ్చే ఆర్టిస్ట్‌ ఎవడో.. టైమ్‌ వచ్చే ఆర్టిస్ట్‌ ఎవడో చెప్పలేం’ అని కోట శ్రీనివాసరావులాంటి పెద్దవాళ్లు అంటుంటారు. టైమ్‌ ఎప్పుడూ వచ్చి పోతుంటుంది. కానీ, మన టైమింగ్‌ ఎప్పుడూ పోదు. జంధ్యాలగారి ఆశీర్వాదంతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశా. నాకు ఇద్దరు గురువులు. ఒకరు జంధ్యాల. మరొకరు విజయ నిర్మల. నా కెరీర్‌లో గొప్ప గొప్ప దర్శకులతో చేశా. హీరోగా 80కు పైగా సినిమాలు పూర్తయిన సమయంలో మనసు రాజకీయాలవైపు మళ్లింది. మంచి పనికోసం వెళ్లాను. ఒక నెల రోజులు షూటింగ్‌ లేకపోతే, షూటింగ్‌లు చేస్తున్నట్లు నాకు కలలు వస్తుంటాయి. ఏదో ఒకటి చేయాలన్న తపన ఇంకా మిగిలిపోయింది. అందుకే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశా. అయితే, ఇదేమీ పూలబాట కాదు. దాదాపు ఆరేడేళ్లు ఒక్క హిట్‌ అయినా పడదా? అని ఎదురు చూసిన రోజులూ ఉన్నాయి. 
మొదటి నుంచి ఆర్టిస్ట్‌గా ఎదగడం వేరు. ఒక హీరో ఆర్టిస్ట్‌గా రావడం అనేది నాకు క్లారిటీ ఉన్నా, నాతో చేసే దర్శకుల తరం మారిపోయింది. ‘ఒకప్పుడు హీరోగా చేసిన ఈయనతో ఏం చేయాలి? కామెడీ చేయించగలమా? సీరియస్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇవ్వాలా?’ అని వాళ్లు ఆలోచించడానికి పదేళ్లు పట్టింది.  ఇది చాలా కీలకమైన టైమ్‌. నాకు అందుకోవడానికి టైమ్‌ పట్టింది కానీ, ఒకసారి ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత మళ్లీ వెనకడుగు వేయలేదు. 

ఏ పాత్రతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నరేశ్‌ లైఫ్‌ టర్న్‌ అయింది?
నరేశ్‌: సినిమా అనేది సముద్రంలో చేపల వేటకు వెళ్లడంలాంటిది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా ‘చంద్రవంశం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. అయితే, ఒకరోజు బి.గోపాల్‌ ఫోన్‌ చేసి, ‘ఎన్టీఆర్‌కు మామగా చేయాలి. నగ్మా మీకు పెయిర్‌గా ఉంటారు’ అని అడిగారు? చేశాను. సినిమా హిట్‌. కానీ, నాకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత ‘మీ శ్రేయోభిలాషి’ నటుడిగా నాకు మంచి పేరు వచ్చింది. అది టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పాలి. ఆ పాత్ర కోసం కొంచెం లావుగా అవ్వాల్సి వచ్చింది. గుండు కూడా చేయించుకున్నా. 

హీరో ఫాదర్‌గా నరేశ్‌ ఒకే.. హీరోయిన్‌ ఫాదర్‌గా చేయటానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా?
నరేశ్‌: ఎప్పుడూ అనిపించలేదు.(నవ్వులు) ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ‘దేవదాస్‌’లో నానికి బ్రదర్‌గా చేయాలన్నారు. ‘అదేంటీ.. నానికి ఫాదర్‌గా చేశా. బ్రదర్‌గా చేస్తే బాగుంటుందా?’ అని అడిగా. ‘బ్రహ్మాండంగా ఉంటుంది’ అని చెప్పారు. నాకు నమ్మకం కుదరలేదు. (మధ్యలో ఆలీ అందుకుని.. తర్వాత నాని కొడుకుగా చేస్తారా ఏంటీ.. నవ్వులు)

ప్రతి తల్లికి నరేశ్‌లాంటి కొడుకు పుట్టాలని విజయ నిర్మల అనుకున్నారా?
నరేశ్‌: ఆమె కేవలం నాకు తల్లిగా మాత్రమే మిగిలిపోలేదు. ఒక గురువుగా, ఒక స్నేహితురాలిగా, ఆదర్శమూర్తిగా నిలిచారు. కృష్ణగారిని ఒక తల్లిలా చూసుకున్నారు. భార్యగా, స్నేహితురాలిగా ప్రతి సమయంలోనూ అండగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం చాలా కష్టం. అలాంటింది ఆమె మా అన్నదమ్ములందరినీ కలిపారు. ఆమె ఎంతోమందికి సాయం చేశారు. ఎన్నో పెళ్లిళ్లు చేయించారు. మా ఇంట్లో ఐదేళ్లు దాటి పనిచేసిన ప్రతి సర్వెంట్‌కు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆమెను ప్రోత్సహించిన బాలసరస్వతిగారికి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చారు. ఇలా చెప్పుకొంటూ పోతే నా తల్లిని నేను పొగుడుతున్నట్లు ఉంటుంది. ఒక మహిళ 46 చిత్రాలకు దర్శకత్వం వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో జరగదు.. భవిష్యత్‌లోనూ ఎవరూ చేయలేరు. ఇలాంటి తల్లికి కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. మరో జన్మంటూ ఉంటే ఆమె కడుపునే పుడతా. 

మీ తల్లి చనిపోతారని ముందే మీకు తెలిసిందా?
నరేశ్‌: చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆమె నడవటానికి ఇబ్బంది పడేవారు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఆమె ఏడ్చేశారు. ‘కృష్ణగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను, ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా, మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నా’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ రోజు నేను కూడా ఏడ్చేశా. ఆ బాధను పోగొట్టుకోవడానికి అందరితో నవ్వుతూ ఉండేవారు. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ ఎంతో ఇచ్చారు. ఒకరోజు నన్ను పిలిచి, ‘నేను ఇబ్బంది పడకుండా భగవంతుడు తీసుకెళ్లిపోయినా.. షిర్డీలో బాబాగారి దగ్గర కుక్కగా పుడతా. నేను గురువారం నాడే చనిపోతా’ అని చెప్పింది. ఆమె ఎలా కోరుకున్నారో అలాగే గురువారం రాత్రి చనిపోయారు. శరీరం ఖననం చేయకముందు ఆమె పాద ముద్రలను తీయించాం. వాటికి బంగారు కవచం చేయించా. ఆమె ఫొటో దగ్గర పెట్టుకున్నా. రోజూ బయటకు వెళ్లేటప్పుడు ఆ పాదాలకు నమస్కరించి వెళ్తా. పడుకునే ముందు కూడా దండం పెట్టుకుని పడుకుంటా. 

‘గుణ’లో మీరు షర్ట్‌లేకుండా చేశారట!
నరేశ్‌: కండలు పెంచుతున్నాం కదా! వాటిని చూపిద్దామని(నవ్వులు). హీరోలే కాదు.. హీరోల ఫాదర్‌లు కూడా చొక్కా విప్పి బాడీ చూపిస్తారు. ‘అ..ఆ’ తర్వాత ‘ఇలాంటి ఫాదర్‌ మాకూ ఉండాలి’ అని అమ్మాయిల ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ‘గుణ’తో అబ్బాయిల ఫాలోయింగ్‌ పెరుగుతుంది. కొడుకు ఏం చేసినా కరెక్ట్‌గా ఉంటుందని నమ్మే తండ్రి పాత్రను ఇందులో చేశా. 

(మధ్యలో ‘గుణ’ హీరో కార్తికేయ వచ్చి చేరారు)

మీ చిత్రంలో ‘A’ హీరో..
నరేశ్‌: ‘గుణ’లో హీరోకు కండలతో పాటు మంచి హృదయం ఉంది. 

‘ఆర్‌ఎక్స్‌100’ అంత విజయం సాధిస్తుందని మీరు అనుకున్నారా?
కార్తికేయ: అస్సలు అనుకోలేదు. ఏ సినిమా అయినా కథ నచ్చితేనే చేస్తా. మార్పులు చేర్పులు చేయమని నేను పెద్దగా అడగను. ‘గుణ’లో కూడా అంతే కథ విషయంలో ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఇంకా అంత పెద్ద స్థాయికి ఎదగలేదు. ఒక సాధారణ ప్రేక్షకుడిలా కథ వింటా. 

నరేశ్‌: ఈ సినిమాలో మార్పులు చెప్పే అవకాశం ఎవరికీ రాలేదు. దర్శకుడు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. పకడ్బందీ స్క్రిప్ట్‌. అద్భుతమైన ఎగ్జిక్యూషన్‌. మన నటనతో ఆ కథకు వన్నె తీసుకురావాలి తప్ప.. ఒక్క షాట్‌ కూడా మేము ఇలా చేయమని చెప్పలేదు. ఈ సినిమా విజయానికి కారణాల్లో ఇదొకటి. 

ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం దర్శకుడు పేరులో ‘జంధ్యాల’ అని ఉండటమేనా?
నరేశ్‌: ఆ జంధ్యాల సినిమాలో హీరోగా చేస్తే, ఈ జంధ్యాల చిత్రంలో హీరో తండ్రిగా చేశా. ఇక సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఎమోషన్‌ కూడా ఉంది. దాన్ని కార్తికేయ అద్భుతంగా చేశాడు.

మీ సొంతూరు ఏది?
కార్తికేయ: హైదరాబాద్‌. ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ చేశా. 

ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది?
కార్తికేయ: చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు బాగా ఇష్టం. అయితే, మా ఇంట్లో చదువుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే వారానికి ఒక సినిమా చూసే అవకాశం కల్పించేవారు.

ఏ హీరోను చూసి మీకు సినిమాల్లోకి రావాలనిపించింది?
కార్తికేయ: చిరంజీవిగారు. ‘ఇంద్ర’ విడుదలైనప్పుడు అయితే, ఆయన ఎలా నడిస్తే అలా.. ఎలా డైలాగ్‌ చెబితే అలా నేను కూడా ఇంట్లో చేసేవాడిని. 

కార్తికేయ మంచి విద్యార్థేనా?
కార్తికేయ: తప్పకుండా. బీటెక్‌ వరకూ బాగా చదివేవాడిని. అయితే సినిమాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో కేవలం పాస్‌ మార్కులు వస్తే చాలనుకునేవాడిని. ఎక్కువగా డ్యాన్స్‌ క్లబ్‌లో ఉండేవాడిని. నటన మీద దృష్టి పెట్టా. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా.

‘ఆర్‌ఎక్స్‌ 100’లో అవకాశం ఎలా వచ్చింది?
కార్తికేయ: ఈ సినిమా కన్నా ముందు ఒకట్రెండు సినిమాలు చేశా. ఒకటి విడుదలైంది. ఇంకొకటి మధ్యలోనే ఆగిపోయింది. అదే సమయంలో అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌100’ కథను వేరే హీరోలకు పంపాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. అప్పుడు నా ఫొటోలను ఎవరో అజయ్‌కు పంపారు. దాంతో నన్ను కలిసి కథ చెప్పారు. నాకూ నచ్చడంతో సినిమా చేశాం.

ఎప్పటికైనా ఫలానా దర్శకుడితో సినిమా చేయాలి అని ఉందా?
కార్తికేయ: నేను బీటెక్‌ చదువుతున్న సమయం దగ్గరి నుంచి ఏదో ఒక రోజున పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని అనుకుంటూ ఉండేవాడిని. 

ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో మీ మదర్‌ కొట్టారట! అమ్మాయిలను ఏడిపించారని కొట్టారా?
కార్తికేయ: అలా ఏమీ లేదండీ. మార్కులు తక్కువ వచ్చాయని కొట్టారంతే.

ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే, తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నారట!
కార్తికేయ: ఇప్పుడు అవన్నీ ఎందుకులేండీ! (నవ్వులు) కాలేజ్‌లో  ఉండగా జరిగింది. ఒక అమ్మాయికి హెల్త్‌ బాగోలేకపోతే, మొక్కుకున్నా. మా అమ్మకు ఇప్పటికీ ఒక డౌట్‌ ‘ఏ రోజూ పూజ కూడా చేయని వీడు. తిరుపతి వెళ్లి గుండు ఎందుకు చేయించుకున్నాడా’ అని..(నవ్వులు) బాగా పరిచయం ఉన్న అమ్మాయి. ఒక రోజు అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయింది. అంబులెన్స్‌ వచ్చి తీసుకెళ్లింది. ఆ అమ్మాయికి ఏమీ కాకూడదనే దేవుడికి మొక్కుకున్నానంతే. అంతకు మించి ఏమీలేదు. తను ఇప్పటికీ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. 

అర్జున్‌ జంధ్యాల కథ చెప్పగానే ‘చాలా బాగుంది సర్‌. వెంటనే చేద్దాం’ అన్నారట!
కార్తికేయ: ఈ ఒక్క సినిమాకే అలా జరిగింది. సాధారణంగా నేను కథ విన్న తర్వాత రెండు మూడు రోజులు ఆలోచిస్తా. బాగా దగ్గర స్నేహితుల వద్ద చర్చించి వాళ్ల సలహా తీసుకుంటా. కానీ, అర్జున్‌ ఈ కథ 20 నిమిషాలు మాత్రమే చెప్పాడు. మిగిలిన కథ సిద్ధం చేయాలని అన్నాడు. అయితే, విన్న వెంటనే సినిమాకు ఒకే చెప్పేశా. 

నరేశ్‌: మహేశ్‌ లేకుండా ‘మహర్షి’ ఊహించలేం. అలాగే కార్తికేయ లేకుండా ‘గుణ’ ఊహించలేం.

తర్వాతి సినిమాలు ఏంటి?
కార్తికేయ: నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో విలన్‌గా చేస్తున్నా. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరోయిక్‌ విలన్‌ అన్నమాట. కథ వినే వరకూ నేను కూడా చేస్తానని అనుకోలేదు. 


 

రియల్‌ లైఫ్‌లో కార్తికేయ ప్లేబాయ్‌ లేక లవర్‌ బాయ్‌?
కార్తికేయ: లవర్‌బాయ్‌. 

‘గుణ’లో నరేశ్‌ మీ తండ్రి పాత్ర చేస్తున్నారన్నప్పుడు మీకు ఏమనిపించింది?
కార్తికేయ: చాలా సంతోషపడ్డా. ఆయన హీరోగా చేసిన సినిమాలంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు వాటిని చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్‌ చేసేవాడిని.

సినిమాల్లో కొడుకు ప్రేమిస్తే, తండ్రి ఎంకరేజ్‌ చేస్తాడు. రియల్‌ లైఫ్‌లో మీ ఫాదర్‌ మీ ప్రేమకు అడ్డు చెప్పారట!
కార్తికేయ: అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది. మా ఫ్రెండ్స్‌ అందరం కలిసి నాతో పాటు చదువుకుంటున్న అమ్మాయికి ఇంటికి వెళ్లి ఆడుకునేవాళ్లం. రోజూ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడంతో మా నాన్నకు అనుమానం వచ్చింది. ఒకరోజు అలా వెళ్తుంటే, సడెన్‌ రోడ్డుమీద నాన్న కనిపించి బండి ఎక్కించుకుని తీసుకెళ్లి, వార్నింగ్‌ ఇచ్చారు. ఆ అమ్మాయికి కూడా జాగ్రత్త ఉండమని చెప్పడంతో తను స్కూల్‌ మానేసి వెళ్లిపోయింది. 

హీరో కాకపోతే ఏం చేసి ఉండేవారు?
కార్తికేయ: నేను హీరో అవుతానని అంటే ఇంట్లో వాళ్లు వద్దన్నారు. బీటెక్‌ అయిపోయిన తర్వాత ఐదేళ్లు టైమ్‌ ఇవ్వమని అడిగా. అమ్మ అయితే వద్దని ఏడ్చేసింది. కానీ, ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు నాన్నకు చెప్పా. ‘నాకు సమయం ఇవ్వండి. ఒకవేళ నేను ప్రయత్నించకపోతే ఆ ఫీలింగ్‌ అలాగే ఉండిపోతుంది. జీవితాంతం బాధపడుతూ ఉంటా. అయితే ప్రయత్నిస్తే, కనీసం ఆ ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది’ అని చెప్పా. సరేనన్నారు. నేను హీరోను కాకపోయి ఉంటే ఏమయ్యేవాడినో తెలియదు. నాకు నటించడం మాత్రమే తెలుసు. హీరోగా ప్రయత్నాలు చేసేవాడిని. కుదరకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అదీ కుదరకపోతే జూనియర్‌ ఆర్టిస్ట్‌గానైనా ఉండిపోయేవాడిని(నవ్వులు) 

మరికొన్ని ప్రశ్నలకు కార్తికేయ సమాధానం
భయపెట్టేది: ఇక సినిమా చేయలేనేమోన్న ఆలోచన
నీకు తెలియని హాట్‌ సీక్రెట్‌: నన్ను అందరూ అమాయకుడు అంటారు
లిప్‌లాక్‌ అంటే: కథానుగుణంగా లిప్‌లాక్‌ చేయడం వేరు. సాధారణం అయితే, ప్రేమించిన అమ్మాయికి మన ప్రేమను వ్యక్తం చేయడం. అయితే నా మూడు సినిమాల్లోనూ లిప్‌లాక్‌లు ఉన్నాయి. ఇక నుంచి మానేస్తా(నవ్వులు)(వెంటనే ఆలీ అందుకుని.. అయ్యో వద్దు.. నీకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. హర్ట్‌ అవుతారు. ఎందుకంటే ముంబయిలో ఇమ్రాన్‌ హష్మి.. ఇక్కడ కార్తికేయ హష్మినువ్వు) 
నీతొలి ప్రేమ పేరు: హేల 
మీలో ఒక క్వాలిటీ తీసేయమంటే: నాకు మొహమాటం ఎక్కువ. దాన్ని తీసేయమంటే. 
యువతకు మీరిచ్చే సందేశం: మీరు జీవితంలో ఏమవుదామనుకుంటున్నారో దానికోసం కనీసం ప్రయత్నం చేయండి. అది అవుతుందా? లేదా అన్నది తర్వాతి విషయం. ఈ ప్రక్రియలో మనం బలంగా తయారవుతాం. 


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.