close

తాజా వార్తలు

హిమసీమలో రతనాల కోట

హాయ్‌! ఫ్రెండ్స్‌... ఎలా ఉన్నారు? మీ చిన్నూని వచ్చేశాగా... ఈసారీ మీకో మంచి కోట కబుర్లు చెప్పేస్తా... బుద్ధిగా వినేయండి మరి!

హిమాలయాల చెంతన ఉంటుందా కోట... దాని పైకి ఎక్కితే.. అబ్బబ్బ... చుట్టూ ఉన్న మంచు కొండలు ఎంత అందంగా కనిపించాయో చెప్పలేను. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాంగ్‌డా సమీపంలో ఉన్న ఈ కోట సంగతులు ఇంకా బోలెడున్నాయి. గబగబా చెప్పేయనా?!

ఈ కోటని చూడగానే బాబోయ్‌ ఇది చాలా ఏళ్లనాటిదే అనుకున్నా. అయితే ఇది ఎప్పుడు కట్టారో కచ్చితమైన ఆధారాలు లేవట. అక్కడున్నవాళ్లని అడిగితే కొందరు వెయ్యేళ్ల కిందట కట్టారంటే.. కొందరు 3,500 సంవత్సరాల పురాతనమైందని రకరకాలుగా చెప్పారు. కాంగ్‌డా లోయలో బనేర్‌, బానగంగా నదుల మధ్య ఉన్న పే...ద్ద కొండపై ఇది ఉంది. నాలుగు కిలోమీటర్ల పరిధిలో 465 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోటలో 11 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అన్నీ ద్వారాలూ చూశా.

* అయితే కాంగ్‌డా కోట దేశంలోనే అతి పురాతనమైనదనీ గైడ్‌ అంకుల్‌ చెప్పారు.  కటోచ్‌ వంశానికి చెందిన సుశర్మ చంద్ర అనే రాజు ఈ కోటను కట్టించారనీ, మహాభారత యుద్ధంలో ఆయన కౌరవులకు మద్దతిచ్చారని ఆ అంకుల్‌ చెప్పారు. దీనిని నాగర్‌కోట్‌ అని కూడా పిలుస్తార్ట.
* ఈ కోటకి చరిత్ర చాలానే ఉంది. దీంట్లో విలువైన సంపద ఎంతో ఉండేదట. బంగారం, వెండి, నవరత్నాలను పోగు చేసి కోటలోని బావుల్లో దాచేవారట. ఈ
సంపదను కొల్లగొట్టాలని ఎందరో కోటపైకి దండెత్తారట. 11వ శతాబ్దంలో గజినీ మహమ్మద్‌ యుద్ధానికి వచ్చి భారీగా సంపదను దోచుకున్నాడట. తర్వాత ఫిరోజ్‌ షా తుగ్లక్‌, షేర్‌ షా ఈ కోటపై దండెత్తారట. అక్బర్‌ ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఆయన కొడుకు జహంగీర్‌ మాత్రం 14 నెలల పాటు యుద్ధం చేసి గెలిచి.. కోటను చేజిక్కించుకున్నాడట.

* ఆ తర్వాత ఆంగ్లేయులూ కాంగ్‌డాపై పెత్తనంచెలాయించారట. కొంత కాలానికి కటోచ్‌ వారసులకు కోటను అప్పగించారట. ఇలా ఎంతో మంది పాలనా మారిందట. భారీ గోడలు, వాటిపై చెక్కిన శిల్పాలు ఇప్పటికీ అబ్బురపరిచేలా ఉన్నాయి. చూడ్డానికి రెండు కళ్లు చాల్లేవ్‌ అంటే నమ్మండి. కోటలో ఆలయాలూ ఉన్నాయి.
* ఓ విషయం తెలిసి కాస్త బాధ పడ్డా. అదేంటంటే... 1905లో కాంగ్‌డా లోయ పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపంవచ్చిందట. దాని ధాటికి కోటలోని నిర్మాణాలు కొన్ని నేలమట్టం అయ్యాయట. ప్రధాన గోడలు, బురుజులు కొన్ని చెక్కు చెదరలేదు. చెరసాలలు, సైనికుల బంకర్లు, ఆలయాలు అలాగే ఉన్నాయి. మెట్ల మార్గం ద్వారా లోపలంతా తిరగొచ్చు. కోట పైకి చేరుకున్న తర్వాత చుట్టూ హిమాలయాలు, కొండలపై పైన్‌ చెట్లు భలేగా కనిపిస్తాయి.
* వేల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ కాంగ్‌డా కోట శిథిలావస్థలో ఉంది. అంత పురాతనమైన రాళ్లు, గోడలు కూలిపోయి కనిపిస్తుంటే ఏదోలా అనిపించింది నాకు. భారత పురాతత్వ శాఖ కోట బాగోగులు చూసుకుంటోందట.

* ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేస్తున్నారని గైడ్‌ అంకుల్‌ చెప్పడంతో హమ్మయ్య అనిపించింది.
* దీన్ని చూడ్డానికి మన కన్నా, విదేశీపర్యటకులే ఎక్కువగా వస్తారట. నేను వెళ్లినప్పుడూ అంతే.. విదేశీయులు ఎంత మంది వచ్చారో! వాళ్లతో సరదాగా ఫొటో దిగా.
* కోటలో ఓ చోట సింహం ముఖం ఆకారంలో చెక్కిన శిల నుంచి నీటి ధార వస్తోంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదట. అవెంత చల్లగా, తియ్యగా ఉన్నాయో!
* ప్రముఖ బౌద్ధక్షేత్రం ధర్మశాల కాంగ్‌డాకి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పనిలోపనిగా అక్కడికీ వెళ్లాను. బౌద్ధారామాలు, పెద్ద క్రికెట్‌ గ్రౌండ్‌ చూసి వచ్చేశాను. భలేగా ఉన్నాయి కదూ! కాంగ్‌డా కోట కబుర్లు. బై బై!


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.