Raghurama: బెయిల్‌పై సుప్రీంలో వాదనలు
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: బెయిల్‌పై సుప్రీంలో వాదనలు

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌ నేతృత్వంలోని వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ చేపట్టింది.  రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రిలో అవకాశమివ్వాలి: ముకుల్ రోహత్గీ

బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

మంగళగిరి ఎయిమ్స్‌లో అభ్యంతరం లేదు: దుష్యంత్‌ దవే

అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని.. అక్కడి నుంచే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని  తెలిపారు. ఆంధ్రాలో విశాఖపట్నంలో నేవల్‌ బేస్‌ ఆస్పత్రి ఉందని.. అది కూడా 300 కి.మీ కంటే ఎక్కువ దూరమని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది.

విచారణ శుక్రవారానికి వాయిదా

మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైంది. రఘురామ వైద్యపరీక్షలకు 10కి.మీ దూరంలో విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. వైద్య పరీక్షలకు దిల్లీ ఎయిమ్స్‌ మంచిదని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తో కొన్ని భయాలు ఉన్నాయని.. అక్కడి పాలకమండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆయన కోరారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేసినందున చాలా ఇబ్బందులు ఉన్నాయని రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఎయిమ్స్‌కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా అన్నారు. పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ఎస్‌జీ వ్యాఖ్యానించగా.. ఇందులో రాజకీయం లేదని.. ఒక న్యాయాధికారిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని దవే కోరారు. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని.. గురువారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆస్పత్రిలో వైద్యపరీక్షలపై మధ్యాహ్నం ఒంటి గంటకు సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని