Tokyo Olympics: తీరిన కల.. జయహో హాకీ ఇండియా.. 41 ఏళ్ల తర్వాత పతకం

తాజా వార్తలు

Updated : 05/08/2021 14:51 IST

Tokyo Olympics: తీరిన కల.. జయహో హాకీ ఇండియా.. 41 ఏళ్ల తర్వాత పతకం

అఖండ భారతావని మురిసిపోయింది. అశేష ప్రజానీకం ఉప్పొంగి పోయింది. 130+కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టోక్యో నడిబొడ్డున త్రివర్ణ పతాకం రెపరెలాడింది. చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగాయి..

ఇక హాకీ ఇండియాకు పునర్వైభవం రానుంది. 4 దశాబ్దాల తర్వాత స్వర్ణోదయానికి అడుగులు పడ్డాయి. ఎన్నాళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది. ఎన్నేళ్లో వేచిన హృదయాలకు తీపి కబురు ఇది. ఒలింపిక్స్‌లో పతకాల కరవు తీరుస్తూ ‘మన్‌’ప్రీత్‌ సేన ఆవిష్కరించిన మహాద్భుతం ఇది..

నిజం చెప్పాలంటే ఒలింపిక్స్‌ పసడి పతక పోరులోనైనా ఇంత ఉత్కంఠ ఉండదేమో? ఎన్ని సూపర్‌ ఓవర్లు చూస్తే ఇంత టెన్షన్‌ అనుభవిస్తాం? క్రికెట్లో ఎన్ని సిక్సర్లు బాదితే ఇంతటి మజా వస్తుంది? ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిస్తే ఎంత ఖుషీ అవుతామో అంతకు మించి ఉత్కంఠభరితమైన విజయం అందించింది మన్‌ప్రీత్‌ సేన.

ఆఖరి క్వార్టర్లో నిమిషాలు గడిచే కొద్దీ.. సెకన్లు ముగిసే కొద్దీ.. కంటిరెప్పలు సైతం వాల్చలేనంతటి నర్వస్‌నెస్‌.. చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌.. ఆ అవకాశం చేజార్చుకుంటే 41 ఏళ్ల కల కలగానే ఉండిపోతుంది. ఆశలన్నీ చెదిరిపోతాయి. సరికొత్త చరిత్రకు అంకురార్పణ ఆగిపోతుంది. అందుకే ఇది పసిడి పోరును మించిన పోరాటం.

సాహో.. హాకీ ఇండియా!! సాహో మన్‌ప్రీత్‌ సేన!! సాహో భారత్‌!!

పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది. పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 ని), హార్దిక్‌ సింగ్‌ (27ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29ని), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31ని) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2ని), నిక్లాస్‌ వెలెన్‌ (24ని), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25ని), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48ని) రాణించారు.

తొలి క్వార్టర్‌లో వెనుకంజ

ప్రత్యర్థి జర్మనీ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత. టీమ్‌ఇండియాకు 41 ఏళ్లుగా పతక పోరులో తలపడ్డ అనుభవమే లేదు. కానీ గెలవాలన్న తపన, కసి మాత్రం ఉన్నాయి. అంతకుమించి స్వర్ణం చేజార్చుకున్నామన్న ఆవేదనా ఉంది. అందుకే ఈ మ్యాచులో ప్రతి క్వార్టర్‌ రసవత్తరంగా సాగింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే ఒరుజ్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టి జర్మనీని 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. భారత్‌పై ఒత్తిడి పెట్టాడు. దాంతో తొలి క్వార్టర్‌ను టీమ్‌ఇండియా 0-1తో ముగించింది.

రెండో క్వార్టర్‌ 5 గోల్స్‌

రెండో క్వార్టర్లో పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. రెండు జట్లు బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. టీమ్‌ఇండియా దూకుడు పెంచింది. ఈ క్వార్టర్లో ఏకంగా మూడు గోల్స్‌ సాధించింది. 17వ నిమిషంలో అద్భుతమైన రివర్స్‌ హిట్‌తో జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ సిమ్రన్‌జీత్‌ ఫీల్డ్‌ గోల్‌ చేశాడు. స్కోరును 1-1తో సమం చేశాడు.

ఈ క్రమంలో టీమ్‌ఇండియా చిన్నచిన్న పొరపాట్లు చేయడంతో జర్మనీకి అవకాశాలు వచ్చాయి. రెండు నిమిషాల వ్యవధిలో వెలెన్‌, బెనడిక్ట్‌ గోల్స్‌ చేసి స్కోరును 3-1కి పెంచారు. నిరాశ పడకుండా పుంజుకున్న భారత్‌ మూడు నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసింది. 27వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హార్దిక్‌ సద్వినియోగం చేశాడు. హర్మన్‌ప్రీత్‌ చక్కని ఫ్లిక్‌తో స్కోరును 3-3తో సమం చేశాడు.

ఆధిక్యంలోకి టీమ్‌ఇండియా

మూడో క్వార్టర్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడింది. అవకాశాలను ఒడిసిపట్టింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేసింది. జర్మనీ గోల్‌పోస్టు వద్ద పదేపదే దాడులు కొనసాగించింది. సిమ్రన్‌జీత్‌ రెండో గోల్‌ కొట్టాడు. అంతకు ముందే పెనాల్టీ స్ట్రోక్‌ను రూపిందర్‌ గోల్‌గా మలవడంతో భారత్‌ 5-3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆఖర్లో ఉత్కంఠ

నాలుగో క్వార్టర్లో రెండు జట్లు ఒత్తిడికి లోనయ్యాయి. గెలవాలని టీమ్‌ఇండియా.. స్కోరు సమం చేయాలని జర్మనీ.. అత్యుత్తమంగా ఆడాయి. 41వ నిమిషంలో మూడు పీసీలు వచ్చినా భారత్‌ ఒడిసిపట్టలేదు. మరో మూడు నిమిషాలకే జర్మనీకీ మూడు పీసీలు వచ్చాయి. గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌, సహచరులతో కలిసి వాటిని అడ్డుకొన్నాడు. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా శ్రీజేశ్‌ కాళ్ల మధ్య నుంచి విండ్‌ఫెదర్‌ గోల్‌ కొట్టి టెన్షన్‌ పెట్టాడు. ఆట మరో 6 సెకన్లలో ముగుస్తుందనగా ప్రత్యర్థికి పీసీ రావడంతో ఒక్కసారిగా షాక్‌! ఈ ఆరు సెకన్లు ప్రత్యర్థిని విజయవంతంగా అడ్డుకోవాలని ఎంతో మంది ప్రార్థించారు. అందుకు తగ్గట్టే అద్భుతం జరిగింది. ఆ పీసీని భారత్‌ విఫలం చేసి చరిత్ర సృష్టించింది.

సాహో.. శ్రీజేశ్‌!

జర్మనీ విజయం కోసం ఎంత పోరాడిందంటే ఏకంగా 28 సార్లు భారత గోల్‌పోస్ట్‌ వృత్తం వద్ద దాడులు చేసింది. అదే భారత్‌కు 15 సార్లే ఇలాంటి అవకాశాలు లభించింది. 13 పీసీల్లో జర్మనీ ఒకటే గోల్‌గా మలిచింది. 11 అవకాశాల్లో మూడు ఫీల్డ్‌ గోల్స్‌ చేసింది. టీమ్‌ఇండియా 6 పీసీల్లో 2 సద్వినియోగం చేసింది. 4 అవకాశాల్లో 2 ఫీల్డ్‌ గోల్స్‌ కొట్టింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. ఇక గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ ఐదు పీసీల్లో 4 అడ్డుకొని భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని