6 నెలల్లో స్థలాలు కేటాయించాలి

ప్రధానాంశాలు

6 నెలల్లో స్థలాలు కేటాయించాలి

అజంజాహీ మిల్లు క్వార్టర్లు ఖాళీ చేసిన 318 మంది కార్మికులకు న్యాయం చేయాలి: సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: వరంగల్‌లోని అజంజాహీ మిల్లు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్న అనంతరం అధికారుల ఒత్తిడిపై అక్కడి క్వార్టర్లను ఖాళీ చేసిన 318 మంది కార్మికులకు ఆరునెలల్లోపు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. 2002లో మిల్లు మూతపడేటప్పుడు 20 ఏళ్లకు పైబడి సర్వీసు ఉన్న 452 మంది ఉద్యోగులకు మిల్లు యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుచేసింది. ఆ తర్వాత.. మిల్లు నిర్మించిన క్వార్టర్లలో నివాసమున్న ఉద్యోగులను ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చింది. క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నందున నివాసయోగ్యం కాదని పేర్కొనడంతో 318 మంది ఉద్యోగులు ఖాళీ చేశారు. మిగతావారు నోటీసులను పట్టించుకోకుండా వాటిలోనే కొనసాగారు. ఈ మధ్యలో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు ఉన్న క్వార్టర్లను వారికే హేతుబద్ధమైన ధరలకు కేటాయించాలని మిల్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. 2002 సెప్టెంబర్‌ 11న కేంద్ర కార్మికశాఖ.. నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌(ఎన్టీసీ) ఆధ్వర్యంలోని మిల్లును మూసేశాక ఆ సంస్థ అక్కడి యంత్రాలు, ఇతర మౌలిక వసతులను విక్రయించింది. మిల్లుకున్న 215 ఎకరాల్లో 117.20 ఎకరాలను కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా)కి 2007లో కేటాయించింది. మరికొంత భాగాన్ని హౌసింగ్‌బోర్డుకు విక్రయించింది. ఆ తర్వాత ఎన్టీసీ చేతిలో 11 ఎకరాలు మిగిలింది. అందులో కొంత భాగాన్ని మిల్లు క్వార్టర్లలో చివరి వరకు నివసించిన 134 మంది ఉద్యోగులకు 200 గజాల చొప్పున కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో జారీ చేసింది. మిల్లు ఆధీనంలో ఉన్న భూమి నుంచి తమకూ 200 గజాల చొప్పున స్థలం కేటాయించాలని స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన ఉద్యోగులు విజ్ఞప్తి చేసుకున్నారు. దీన్ని పట్టించుకోకపోవడంతో కార్మిక సంఘాలు 2007లో హైకోర్టును ఆశ్రయించాయి. వీరి వాదనలతో ఏకీభవించిన ఏకసభ్య ధర్మాసనం ఈ 318 మందికీ 200 గజాల చొప్పున స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్టీసీ, కుడాలు డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేయగా ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కార్మిక సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసి ఏకసభ్య ధర్మాసనం తీర్పును సమర్థించింది. సంక్షేమ చర్యగా 134 మంది మాజీ ఉద్యోగులకే ఇళ్లస్థలాలు కేటాయించి మిగతావారిని విస్మరించడం వివక్ష కిందికే వస్తుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. 318 మందికి 200 గజాల స్థలాన్ని కేటాయించాలని ‘కుడా’ను ఆదేశించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని