close
విదేశీ యూరియా ఎప్పుడొచ్చేను! 

ఈనెలలో రాష్ట్రానికి లక్షా 5 వేల టన్నులు రావాలి 
త్వరగా తెప్పించాలని కంపెనీలకు వ్యవసాయశాఖ ఆదేశం 
నౌకాశ్రయాల నుంచి తరలించడానికి గూడ్సు రైళ్ల కొరత 
వర్షాలు పడుతున్నందున పెరుగుతున్న ఎరువుల విక్రయాలు 
ఈనాడు - హైదరాబాద్‌

విదేశాల నుంచి యూరియా రావడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రానికి ఈ నెలలో 2 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయిస్తే అందులో సగం వరకు విదేశాల నుంచి వస్తుందని కేంద్ర ఎరువుల శాఖ తాజాగా తెలంగాణ వ్యవసాయశాఖకిచ్చిన ఆదేశాల్లో తెలిపింది. కానీ ఇంతవరకూ రాష్ట్రానికి రాలేదని, త్వరగా తెప్పించాలని ఇఫ్కో, కోరమాండల్‌, ఐపీఎల్‌ కంపెనీలకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నందున యూరియాకు డిమాండు అధికమయ్యే అవకాశాలున్నాయని కంపెనీలకు వివరించింది. పంటల సాగు విస్తీర్ణం అధికమైతే యూరియా కొరత రాకుండా చూడాలని స్పష్టం చేసింది.

నౌకలొచ్చినప్పుడే... 
విదేశీ యూరియా గ్రామాలకు చేరడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రానికి లక్షా 5 వేల టన్నులు విదేశీ యూరియాను కేటాయించినా అది నేరుగా ఒకేసారి కంపెనీలు రాష్ట్రానికి పంపే అవకాశం లేదు. విదేశాల నుంచి నౌకల్లో యూరియా ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని నౌకాశ్రయాలకు వస్తుంది. అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం పంచుతుంది. ఇటీవల ఏపీలోని కాకినాడ తీరానికి వచ్చిన నౌక నుంచి 11 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి ఇవ్వడానికి ఇఫ్కో కంపెనీకి కేటాయించింది. దానిని నౌకలో నుంచి దింపి అక్కడ 3 గూడ్సు రైళ్లలో నింపుతున్నారు. అక్కడి నుంచి మంగళవారం నాటికి తెలంగాణ జిల్లాలకు రైళ్లు చేరే అవకాశముందని ఇఫ్కో వర్గాలు వ్యవసాయశాఖకు సమాచారమిచ్చాయి. ఈ కంపెనీ నుంచి 35 వేల టన్నుల దాకా ఈ నెలలో విదేశీ యూరియా రావాల్సి ఉండగా 10వ తేదీ నాటికి 11 వేల టన్నులు గ్రామాలకు చేరింది. ఇలా ప్రతి కంపెనీకి నౌక నుంచి కేటాయింపు, అక్కడి నుంచి గూడ్సు రైళ్ల ద్వారా తెలంగాణకు రావాలి. ఈ ప్రక్రియలో ఒక్కోసారి నౌక రావడం, గూడ్సు రైళ్లు దొరకడం ఆలస్యమవుతోంది. 
కానీ కంపెనీల వాదన మరోరకంగా ఉంది. గత నెలలో తెలంగాణలో వర్షాలు పెద్దగా పడలేదని ఎరువుల అమ్మకాలు అంతగా లేవని చెబుతున్నాయి. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వర్షాలు కురిస్తే ఒక్కసారిగా డిమాండు పెరిగి యూరియా కొరత ఏర్పడి రైతులు రోడ్లపైకి వస్తారని ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ప్యాక్స్‌) సైతం పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పాస్‌) యంత్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసి వాటి ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

సూక్ష్మ పోషకాలు వాడాలి 
భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఫలితాల ఆధారంగా రసాయన ఎరువుల సూక్ష్మ పోషకాలు వాడాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. జింక్‌, జిప్సం వంటి పోషకాలను వాడటం వల్ల పంటల దిగుబడులు పెరుగుతాయంది. ప్రస్తుత ఏడాదిలో రైతులకు ఈ రెండు పోషకాలపై ఇచ్చే రాయితీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జింక్‌ ధర క్వింటాకు రూ.4150 కాగా దీనికి కొనే రైతులకు హెక్టారుకు రూ.500 రాయితీగా వ్యవసాయశాఖ భరిస్తుంది. జిప్సం ధర క్వింటాకు రూ.500 కాగా హెక్టారుకు రూ.750 చొప్పున రాయితీగా ఇస్తారు. వీటిని రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య ద్వారా పంపిణీ చేస్తారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.