Published : 10 Nov 2022 00:08 IST

అజగరుడి అద్భుతబోధ!

ప్రహ్లాదుడు రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో ఒకసారి లోకసంచారం చేస్తుండగా పర్వత సానువుల్లో అజగరుడనే ముని కనిపించాడు. అతడు నేలపై పడుకున్నాడు. పోషణ లేకున్నా, శరీరం ధూళితో ఉన్నా తేజస్సు తగ్గలేదు. ఆ నిర్వికారుడికి భక్తిగా నమస్కరించిన ప్రహ్లాదుడు ‘మునీశ్వరా! నువ్వు అసామాన్యుడివి. ఏ ప్రయత్నమూ ధనభోగాలూ లేకుండా రాతినేలపై నిద్రించే నీకు ఇంత సుందరదేహం ఎలా వచ్చింది? ఎవరినీ దూషించవు, భూషించవు. సమదృష్టి చూపే స్థితప్రజ్ఞుడివి! ఇలాంటి నువ్వు నిద్రలోనే ఎందుకు గడుపుతున్నావు?’ అనడిగాడు. ఆ మాటలకు అజగరుడు పరవశుడై సమాధానమిస్తూ ‘పుణ్యాత్మా! నేనూ గతంలో భౌతికసుఖాల కోసం పరుగులు పెట్టినవాణ్ణే! కర్మబంధాల్లో చిక్కుకుని సంసారచక్రంలో పరిభ్రమించినవాణ్ణే! ఆ ప్రయాసలో నానా జన్మలెత్తి అలసిపోయాను. కోరికల వల్ల కష్టాలూ కన్నీళ్లే తప్ప శాశ్వత ఆనందం లభించదని అర్థమైంది. ధన, ప్రాణాల మీద ప్రీతి ఉన్న వాళ్లను భయం వెంటాడుతుందని తెలుసుకున్నాను. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ తదితరమైనవన్నీ కోరికల వల్లేనని నిర్ధరించుకున్నాను’ అన్నాడు. ఆనక లోకంపోకడను వివరిస్తూ ‘తేనెటీగలు కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లు లోభుల సొమ్ము పరులకు ప్రాప్తిస్తుందే తప్ప సంపాదించినవారికి ఉపయోగపడదు. దొరికిందే తిని కదలకుండా పడి ఉండే పెనుబాము కూడా చాలాకాలం బతుకుతుంది. ఒక కొండచిలువను చిరకాలం పరిశీలించి ఈ నీతి నేర్చుకున్నాను. అందుకే ఇలా ఏకాంతవాసం చేస్తున్నాను’ అన్నాడు. ‘కొండచిలువ, తేనెటీగ నాకు గురువులు. వాటి దగ్గర పాఠాలు నేర్చుకుని, ఈ నిర్జన ప్రదేశంలో కర్మబంధాల గందరగోళం లేకుండా నిశ్చింతగా మునివృత్తిలో జీవిస్తున్నాను’ అంటూ అజగరుడు జీవనసూత్రాన్ని తెలియజేశాడు. ఇలా ప్రియాప్రియాలకు అతీతంగా జీవించేవారు మన్ననలందుకుంటారు. హుందాతనం అనేది వారికి ప్రాప్తించిన కష్టసుఖాలతో తెలుస్తుంది. ఆ పరీక్షలో నెగ్గినవారే అసలైన స్థితప్రజ్ఞులు.

- బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు