సూదంత సమస్య

ఓ ఆశ్రమంలో స్వామీజీ దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న ఒక మహిళ పక్కనున్నామెతో మాట కలిపింది.

Published : 02 Feb 2023 00:30 IST

ఆశ్రమంలో స్వామీజీ దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న ఒక మహిళ పక్కనున్నామెతో మాట కలిపింది. తన కొడుకు పెంకె పిల్లవాడని, ఆ అల్లరిని భరించలేకపోతున్నామని వాపోయింది. ఒక నిమిషమాగి ‘ఇంతకీ నీ సమస్య ఏమిటి?’ అనడిగింది. ‘పెళ్లై పదేళ్లయినా పిల్లలు కలగలేదు. ఎందరో వైద్యుల్ని కలిశాం. ఎన్నో మొక్కులు మొక్కాం. ఫలితం లేదు. పిల్లలు లేరనే బాధకు తోడు పెళ్లీ పేరంటాల్లో పిల్లల ప్రస్తావన వస్తుంది. ఆ విషయం ఎవరు అడుగుతారోననే భయంతో ఎక్కడికీ వెళ్లాలనిపించడంలేదు. మా బాధ స్వామీజీతో చెప్పుకుందామని వచ్చాం’ అందామె. ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. ‘బిడ్డ అల్లరికే బాధపడుతున్నాను, సంతానమే లేకపోతే ఎంత బాధ?! ముక్కు ఉంటే జలుబు చేస్తుంది. కానీ ముక్కే లేకపోతే ఎంత బాధ? చిన్నతనపు చిలిపి చేష్టలను ఆస్వాదించకపోగా విసుగుచెందుతున్నాను. పిల్లాడే లేకపోతే భరించగలనా? నా సూదంత సమస్యే పెద్దదనుకున్నాను. ఇవి కదా అసలైన దుఃఖాలు’ అనుకుంది. స్వామిని ఏమీ అడగకుండానే వెనుతిరిగింది.

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని