సర్వం ఈశ్వరమయం

సకల చరాచర జగత్తునూ ఈశ్వరుడు పరివేష్టించి ఉన్నాడు. ప్రతి జీవిలో, వస్తువులో, అణువణువులో, లోపలా బయటా అంతటా పరమాత్ముడే ఆవరించి ఉన్నాడు.

Published : 11 May 2023 00:36 IST

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్తేన భుంజీధా మా గృధః కస్య స్విద్ధనమ్‌

సకల చరాచర జగత్తునూ ఈశ్వరుడు పరివేష్టించి ఉన్నాడు. ప్రతి జీవిలో, వస్తువులో, అణువణువులో, లోపలా బయటా అంతటా పరమాత్ముడే ఆవరించి ఉన్నాడు. లోకంలోని సుఖదుఃఖాలు, కష్టనష్టాలను తామరాకు మీద నీటిబొట్టులా వైరాగ్య బుద్ధితో స్వీకరించు. నీకు న్యాయంగా ప్రాప్తించిన వాటినే అనుభవించు, వేరొకరివేవీ ఎన్నడూ ఆశించవద్దు- అన్నది ఈ శ్లోకానికి అర్థం.
ఈశావాస్యోపనిషత్తులోని ఈ మంత్రంలో జ్ఞాన, కర్మ, నైతిక- అనే మూడు యోగాలున్నాయి.
సమస్త విశ్వం ఈశ్వరమయం అని చెప్పడం జ్ఞానయోగం. నిష్కామ బుద్ధితో జగత్తును అనుభవించ మనడం కర్మయోగం. పరుల ధనాన్ని ఆశించకూడదని చెప్పడం నీతియోగం. ఈ మూడు యోగాల త్రివేణి సంగమమే ఈ మంత్రం. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రసిద్ధులైన బాలగంగాధర తిలక్‌, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహనీయులు ఎందరికో ఈ మంత్రం స్ఫూర్తి కలిగించింది. మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ప్రేరణ అయ్యింది.

 శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు