రామాయణం ఎలా అవతరించిందంటే..

బ్రహ్మదేవుడి ముఖం నుంచి వేదం, వాల్మీకి మహర్షి ఘంటం నుంచి శ్రీమద్రామాయణం జాలువారాయి. ఆ ఇద్దరూ చతురాస్యులే.

Published : 21 Sep 2023 00:25 IST

బ్రహ్మదేవుడి ముఖం నుంచి వేదం, వాల్మీకి మహర్షి ఘంటం నుంచి శ్రీమద్రామాయణం జాలువారాయి. ఆ ఇద్దరూ చతురాస్యులే. అంటే ఒకరు చతుర్ముఖులు, ఇంకొకరేమో చతుర వచనులు. బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టిస్తే.. వాల్మీకి శ్లోకాలను సృజించాడు. ఇద్దరి మధ్య భేదం లేశమాత్రమే. కనుకనే వేదసారమైన రామాయణ మహా కావ్యం వాల్మీకి హృదయం నుంచి ఆవిర్భవించింది. ఆయన ఆదికవి మాత్రమే కాదు. వేదాంతి, దార్శనికుడు, తపస్వి, జనులకు మార్గదర్శకుడు, సంస్కర్త, కార్యాచరణవేత్త కూడా. ఒకసారి వాల్మీకి శిష్యగణంతో కలిసి తమసా నదీ తీరాన వెళ్తుండగా.. ఓ వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని హతమార్చగా, ఆడపక్షి విలపించింది. ఆ దృశ్యం చూసిన వాల్మీకి హృదయం ద్రవించింది. కళ్లు వర్షించాయి. కంఠం గద్గదమైంది. ఆ దుఃఖం..
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీస్సమాః
యత్‌ క్రౌంచ మిథునాదేక వధీః కామ మోహితం

అంటూ శ్లోకంగా పెల్లుబికింది. ‘కామ మోహితమైన క్రౌంచ దంపతుల్లో ఒకదాన్ని చంపి శాశ్వత అపకీర్తి పొందావు కిరాతుడా!’ అనేది భావం. ఆ బాధతోనే మెల్లగా తన ఆశ్రమానికి వెళ్లాడు. పక్షి చనిపోయిన దృశ్యం మాత్రం మనసులోనే మెదులుతోంది. ఆయన మానసిక స్థితిని చూసిన బ్రహ్మదేవుడు ‘మహర్షీ! శోకంతో ఛందోబద్ధమైన శ్లోకం చెప్పావు. శ్రీరామచరితకు అక్షరరూపం ఇవ్వు! అది మహాకావ్యమై భాసిల్లుతుంది. నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది’ అన్నాడు. ఆ పలుకే ప్రేరణ కలిగించింది. వాల్మీకి యోగాశీనుడై రామచరితంలోని ఘట్టాలు, దృశ్యాలను మనోనేత్రంతో చూడగలిగాడు. శ్రీమద్రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. 

శివరాజేశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు