బ్యాంక్‌ నోట్‌ప్రెస్‌లో ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది యూనిట్లలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.. ‘బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌’ (బీఎన్‌ఎస్‌) ఒకటి.

Published : 01 Aug 2023 00:01 IST

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది యూనిట్లలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.. ‘బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌’ (బీఎన్‌ఎస్‌) ఒకటి.  దేవాస్‌ (ఎంపీ)లోని ఇది తాజాగా సూపర్‌వైజర్‌, జూనియర్‌ టెక్నీషియన్‌ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ విద్యార్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. సూపర్‌వైజర్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తారు.

1) సూపర్‌వైజర్‌ (ప్రింటింగ్‌): 8 ఖాళీలున్నాయి. ప్రింటింగ్‌ టెక్నాలజీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు.

2) సూపర్‌వైజర్‌ (కంట్రోల్‌): 3 పోస్టులున్నాయి. ప్రింటింగ్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్లాజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు.

3) సూపర్‌వైజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 1 పోస్టు. ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా బీటెక్‌/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేయొచ్చు. సూపర్‌వైజర్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 30 ఏళ్లు.

4) జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 4 పోస్టులు. 55 శాతం మార్కులతో డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికీ 40 పదాలు/హిందీలో 30 పదాలను కంప్యూటర్‌పైన టైప్‌ చేయగలగాలి. ఈ పోస్టుకు గరిష్ఠ వయసు 28 ఏళ్లు.

5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌): 27 పోస్టులు. ప్రింటింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి.

6) జూనియర్‌ టెక్నీషియన్‌ (కంట్రోల్‌): 25 పోస్టులు. హ్యాండ్‌ కంపోజింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి.

7) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఇంక్‌ ఫ్యాక్టరీ): 15 పోస్టులు. అటెండెంట్‌ ఆపరేటర్‌/ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ మెషినిస్ట్‌ ట్రేడ్‌/ మెషినిస్ట్‌ గ్రైండర్‌ట్రేడ్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా ఉండాలి.

8) జూనియర్‌ టెక్నీషియన్‌ (మెకానికల్‌/ ఎయిర్‌ కండిషనింగ్‌): 3 పోస్టులు. ఐటీఐ ఫిట్టర్‌ సర్టిఫికెట్‌ లేదా మెకానికల్‌ (ఫిట్టర్‌) డిప్లొమా పాసవ్వాలి.

9) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ): 4 పోస్టులు. ఐటీఐ ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్టిఫికెట్‌ లేదా ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి.

10) జూనియర్‌ టెక్నీషియన్‌ (సివిల్‌/ ఎన్విరాన్‌మెంట్‌): 1 పోస్టు. ఐటీఐ వెల్డర్‌ సర్టిఫికెట్‌/ సివిల్‌ (వెల్డర్‌) డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. ఇతరులకు రూ.600.

పరీక్ష ఎలా ఉంటుంది?

సూపర్‌వైజర్‌ పోస్టుకు: 1) టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు 50 (125 మార్కులు), 2) జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు), 3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు (25 మార్కులు), 4) లాజికల్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు), 5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు). మొత్తం 165 ప్రశ్నలకు 240 మార్కులు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు.

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు: పరీక్ష రెండు ఫేజుల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌లో పాసైన అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్షకు ఎంపికచేస్తారు. టైపింగ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌ లేదా హిందీలో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో 1) జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు), 2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు), 3) లాజికల్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు, 4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు). మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.

జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుకు: 1) టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు (75 మార్కులు), 2) జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు), 3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు), 4) లాజికల్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు), 5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలకు 125 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.
ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు లేవు. ఆన్‌లైన్‌ పరీక్ష సెప్టెంబర్‌/అక్టోబర్‌ నెలల్లో ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే  నిర్వహిస్తారు.

సన్నద్ధత ఎలా?

సూపర్‌వైజర్‌, టెక్నీషియన్‌ పోస్టులకు జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో.. టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు. ఆయా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని, రివిజన్‌ చేసుకోవాలి.

  • అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఇప్పటినుంచే సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సన్నద్ధతను ప్రారంభించాలి. రోజువారీ టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అనుసరించాలి.
  • టైమ్‌టేబుల్‌లో ప్రతి సబ్జెక్టుకూ తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. క్లిష్టంగా అనిపించే అంశాలను వాయిదా వేయకుండా వాటి పైన ఎక్కువ సమయాన్ని వినియోగించాలి.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ముందుగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి.. చివర్లో కాస్త క్లిష్టంగా ఉన్న వాటిని సాధిస్తే సమయం వృథా కాదు.
  • పాత ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలకు బ్యాంక్‌ పోటీ పరీక్షల పుస్తకాలనూ చదవొచ్చు. కొన్ని వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టులూ అందుబాటులో ఉన్నాయి. వాటిని రాయడం మేలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023

వెబ్‌సైట్‌: https://bnpdewas.spmcil.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని