దూరవిద్యలో ఇంటర్‌ చదివితే..?

డిప్లొమా మొదటి ఏడాది చదువుతున్నాను. కొన్ని పోటీ పరీక్షలకు కనీసార్హత ఇంటర్‌ కాబట్టి అది కూడా చదవాలనుకుంటున్నాను. దూరవిద్యలో చదివితే రెగ్యులర్‌తో సమానార్హత ఉంటుందా?  

Updated : 21 Nov 2022 01:22 IST

డిప్లొమా మొదటి ఏడాది చదువుతున్నాను. కొన్ని పోటీ పరీక్షలకు కనీసార్హత ఇంటర్‌ కాబట్టి అది కూడా చదవాలనుకుంటున్నాను. దూరవిద్యలో చదివితే రెగ్యులర్‌తో సమానార్హత ఉంటుందా?  

- ఎస్‌.కె.నాగుర్‌బాషా  

* సాధారణంగా పదో తరగతి తరువాత చదివే మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను ఇంటర్‌తో సమానంగానే పరిగణిస్తారు. ఈ మేరకు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను కూడా జారీ చేశాయి. డిప్లొమా పూర్తయిన తరువాత మీరు నిరభ్యంతరంగా డిగ్రీ లో చేరవచ్చు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. కొన్ని ప్రత్యేక విద్యా/ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాత్రమే ఇంటర్‌ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నారు. మరికొన్ని ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్లలో ఇంటర్‌ రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన కూడా ఉంటుంది. అలాంటి అతికొద్ది ఉద్యోగాలకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివే ఇంటర్మీడియట్‌ను రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణిస్తారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల్లో ఏకకాలంలో రెండు డిగ్రీలు చేయవచ్చని మాత్రమే ప్రస్తావించారు. ఇంటర్‌, డిప్లొమాలు ఒకేసారి చదవడం గురించి ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిప్లొమా చదువుతూనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో ఇంటర్‌ చదివితే, రెండు సర్టిఫికెట్‌లను ఒకేసారి ఉపయోగించుకోలేరు. మూడు సంవత్సరాల తరువాత ఇంటర్‌ విద్యార్హతతో రాయబోయే పోటీ పరీక్షలకంటే ముందు, ప్రస్తుతం చదువుతున్న డిప్లొమా కోర్సుపై శ్రధ్ధ పెట్టండి. విషయపరిజ్ఞానం పెంపొందించుకొని, మెరుగైన ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని