ఉపకార వేతనంతో సంగీత విద్య..

చాలామంది సంగీతాన్ని పాఠశాల స్థాయి నుంచే నేర్చుకుంటారు. కనీసం ఐదేళ్ల శిక్షణ తర్వాతే శాస్త్రీయ సంగీతంపై కొంత అవగాహన వస్తుంది.

Updated : 08 Dec 2022 05:57 IST

దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాను. శాస్త్రీయ సంగీతమంటే ఆసక్తి. ఉపకార వేతనంతో సంగీతం నేర్పించే విశ్వవిద్యాలయాలున్నాయా? ఈ కోర్సులో ఉండే ఉద్యోగావకాశాలేమిటి?

ఎం.అమూల్య

* చాలామంది సంగీతాన్ని పాఠశాల స్థాయి నుంచే నేర్చుకుంటారు. కనీసం ఐదేళ్ల శిక్షణ తర్వాతే శాస్త్రీయ సంగీతంపై కొంత అవగాహన వస్తుంది. చాలా విశ్వవిద్యాలయాల్లో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేయాలంటే, మ్యూజిక్‌లో డిగ్రీ చేసి ఉండాలి. మ్యూజిక్‌లో డిగ్రీ లేనట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు మ్యూజిక్‌లో ప్రొఫెషనల్‌ డిప్లొమా అయినా ఉండాలి. ఈ రెండూ లేని పక్షంలో డిగ్రీతో పాటు ఎవరైనా ప్రఖ్యాత సంగీత గురువు దగ్గర కనీసం ఐదేళ్లు కఠిన శిక్షణ పొంది ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. వీటి ప్రకారం మీకు పీజీ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత ఉంటే యూనివర్సిటీకి దరఖాస్తు చేసి ప్రవేశ పరీక్ష రాయాలి. దీనిలో సాధించిన ప్రతిభ ఆధారంగా శాస్త్రీయ సంగీతంలో ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఉంటుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ల్లోని మార్కుల ఆధారంగా పీజీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

ఉపకార వేతనాలతో సంగీతం నేర్పించే విశ్వవిద్యాలయాలు ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ ప్రతిభావంతులైన యువ సంగీత కళాకారులకు ఉపకార వేతనాలు అందిస్తోంది. ముందుగా మీరు సంగీత గురువు దగ్గర కొన్నేళ్లు శిక్షణ పొంది, మ్యూజిక్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేశాక యూనివర్సిటీల్లో పీజీ కోసం ప్రయత్నించండి. అలా వీలుకాని పక్షంలో ఏదైనా ప్రైవేటు సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోండి. ఈ మొత్తం ప్రక్రియలో సరైన  గురువు/కళాశాల ఎంపిక చాలా ముఖ్యం. శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుల్ని సంప్రదించి సరైన సలహాలు తీసుకోండి. సంగీతంలో డిగ్రీ పొందాక బోధనవృత్తిలో చాలా ఉద్యోగావకాశాలుంటాయి. ఆల్‌ ఇండియా రేడియోలో, వివిధ టీవి ఛానళ్లలో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఇవేకాకుండా, పియానిస్ట్‌, సింగర్‌, మ్యుజీషియన్‌, కండక్టర్‌, కంపోజర్‌.. తదితర విభాగాల్లో స్థిరపడవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని