సమానార్హత ఉంటుందా?

ఓపెన్‌ యూనివర్సిటీ/ దూరవిద్య ద్వారా చేసే డిగ్రీలకూ రెగ్యులర్‌గా చేసే డిగ్రీలకూ ఎలాంటి తేడా లేదు.

Updated : 18 Jan 2023 04:36 IST

పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేస్తున్నాను. ఓపెన్‌ యూనివర్సిటీలో చేసిన డిగ్రీలకు రెగ్యులర్‌ డిగ్రీలతో సమానార్హత ఉంటుందా?  ఈ అర్హతతో పోటీ పరీక్షలు రాసుకోవచ్చా?       

కావ్య

* ఓపెన్‌ యూనివర్సిటీ/ దూరవిద్య ద్వారా చేసే డిగ్రీలకూ రెగ్యులర్‌గా చేసే డిగ్రీలకూ ఎలాంటి తేడా లేదు. రెండు డిగ్రీలనూ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలే ఇస్తున్నాయి కాబట్టి, రెండింటినీ సమానంగానే గుర్తిస్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అయినా యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అనే అడుగుతారు కానీ, రెగ్యులర్‌గా డిగ్రీ చేసి ఉండాలని పేర్కొనరు. మీరు నిరభ్యంతరంగా ఉన్నత విద్య/ నెట్‌/ స్లెట్‌/ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన సందర్భాల్లో ఓపెన్‌/ దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారు అర్హులు కారు అన్న నిబంధన ఉన్నచోట మినహా, మిగతా అన్ని పోటీ పరీక్షలకూ రెగ్యులర్‌ డిగ్రీ చేసినవారితో సమానంగా మీరూ పోటీపడవచ్చు. సాధారణంగా రెగ్యులర్‌ డిగ్రీ చేసినవారు రోజూ క్లాసులకు వెళ్లి పాఠాలు విని, విషయ పరిజ్ఞానం పొందుతారు. ఓపెన్‌ యూనివర్సిటీ విద్యావిధానంలో విద్యార్థి తనకు తానే సబ్జెక్టును నేర్చుకుంటాడు. పోటీ పరీక్షల్లో ఇద్దరూ పోటీ పడినప్పుడు రెగ్యులర్‌గా డిగ్రీ చేసినవారికి కొంత మొగ్గు ఉండే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఓపెన్‌ యూనివర్సిటీలో చదివినవారు ఎక్కువ కృషి చేయాలి. ఇలా చదివిన చాలామంది రెగ్యులర్‌గా చదివిన వారితో పోటీపడి, వారికంటే మెరుగైన ప్రతిభని కనపర్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దాఖలాలూ ఉన్నాయి. కాబట్టి ఈ డిగ్రీల సమానార్హత గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా.. నిరభ్యంతరంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని