సివిల్స్‌కు సన్నద్ధత ఎలా?

డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సివిల్స్‌కి తయారవ్వాలనుకోవడం సరైన నిర్ణయమే. ముందుగా మీరు ప్రిలిమ్స్‌ పరీక్షకు జనరల్‌ స్టడీస్‌ సన్నద్ధత మొదలుపెట్టండి

Updated : 27 Jul 2023 02:38 IST

బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. సివిల్స్‌ రాయాలని ఉంది. దానికి ఇప్పటినుంచే ఎలా సన్నద్ధం కావాలి? ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ ఏది మేలు?

ఎం.చందు

డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సివిల్స్‌కి తయారవ్వాలనుకోవడం సరైన నిర్ణయమే. ముందుగా మీరు ప్రిలిమ్స్‌ పరీక్షకు జనరల్‌ స్టడీస్‌ సన్నద్ధత మొదలుపెట్టండి. జనరల్‌ స్టడీస్‌లో ఎకానమీ, పాలిటీ, భారత రాజ్యాంగం, హిస్టరీ, సోషియాలజీ, జనరల్‌ సైన్స్‌, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో కరెంట్‌ అఫైర్స్‌ భాగంగా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో రెండో పేపర్‌గా సీశాట్‌ ఉంటుంది. ఇందులో కాంప్రహెన్షన్‌, కమ్యూనికేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, బేసిక్‌ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ ఉంటాయి. ప్రతిరోజూ వార్తాపత్రికలను, ఎడిటోరియల్‌ పేజీ వ్యాసాలను చదివి.. నోట్స్‌ తయారుచేసుకోండి. పైన చెప్పిన సిలబస్‌లో ప్రామాణిక పుస్తకాలను సేకరించి, పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ ప్రణాళిక ప్రకారం చదవండి. సివిల్స్‌ కోసం సిద్ధమవుతూ మీరు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీని అశ్రద్ధ చేయకండి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించాక మెయిన్స్‌ పరీక్ష రాయాలి.

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ విషయానికొస్తే, మీరు డిగ్రీలో చదువుతున్న ఫోరెన్సిక్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ సివిల్స్‌ ఆప్షనల్‌ జాబితాలో లేదు. కెమిస్ట్రీ సబ్జెక్ట్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌కి దగ్గరగా ఉంటుంది కానీ, సిలబస్‌ పీజీ స్థాయిలో ఉంటుంది. సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో పోల్చినప్పుడు, కెమిస్ట్రీ లాంటి సైన్స్‌ సబ్జెక్టుల్లో స్కోరింగ్‌ అవకాశాలు కొంత తక్కువ. ఐఐటీ లాంటి సంస్థల్లో చదివిన కొంతమంది సైన్స్‌, ఇంజినీరింగ్‌ లాంటి సబ్జెక్టులతో కూడా సివిల్స్‌ రాసి విజయం సాధిస్తున్నారు. చాలామంది ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులు సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టును ఎంచుకుంటే, బాగా చదివే అవకాశం ఉంటుంది. సిలబస్‌ నిడివి, మెటీరియల్‌ లభ్యత, పాత ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సరళి లాంటి అంశాల ఆధారంగా ఆప్షనల్‌ను ఎంచుకోవాలి. సివిల్స్‌ విజేతల ఇంటర్వ్యూలను చూస్తూ, వారిచ్చే మెలకువలను కూడా పరిగణనలోకి తీసుకొని, మీ కల నెరవేర్చుకోండి!
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని