JEE-NEET: కెరీర్‌లో ఆ సమస్యలొస్తాయ్‌.. కానీ!: విద్యార్థులతో ‘వీక్లీ డిన్నర్‌’లో కలెక్టర్‌

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల్లో ఒత్తిడిని జయించేందుకు కోటా జిల్లా కలెక్టర్‌ పలు సూచనలు చేశారు.

Updated : 29 Jan 2024 19:30 IST

కోటా: జేఈఈ (JEE), నీట్‌ (NEET) వంటి పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి వచ్చి అక్కడ పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతోన్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల్లో పరీక్షలంటే భయం తగ్గించి మానసిక స్థైర్యం పెంచేందుకు కోటా జిల్లా కలెక్టర్‌ డా.రవీంద్ర గోస్వామి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి శుక్రవారం విద్యార్థులతో కూర్చొని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం, పరీక్షలపై భయాన్ని పోగొట్టేలా ‘వీక్లీ డిన్నర్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా గత శుక్రవారం శివ్‌ రెసిడెన్సీ గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థినులతో దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై ఆయన చర్చించారు. అనంతరం విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు.

పిల్లల రిపోర్ట్‌ కార్డ్‌.. మీ విజిటింగ్‌ కార్డ్‌ కాదు: ‘పరీక్షా పే చర్చ’లో ప్రధాని మోదీ

ఈసందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్‌ మాట్లాడుతూ..  ‘‘నేనూ కోచింగ్‌ కోసం కోటాకు వచ్చా.. ఆతర్వాత కొద్ది రోజులకే నచ్చక తిరిగి వెళ్లిపోయా.  సొంతంగానే ప్రిపరేషన్‌ కొనసాగించి విజయం సాధించా.  విద్యార్థి దశలో అయోమయం, అనిశ్చితి, ఒత్తిడికి గురికావడం వంటివి ఎదురవుతాయి. ఈ సమయంలోనే దృఢంగా, తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.  మనల్ని మరింత దృఢంగా మార్చేందుకే సమస్యలు వస్తాయి.. అలాంటప్పుడు భయంతో పారిపోకుండా ఎదుర్కోవాలి.  అప్పుడే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది’’

‘‘కెరీర్‌లో ఇతర ఆప్షన్లనూ తెరిచి ఉంచుకోవాలి. జీవితంలో లక్ష్యం అనేది మార్గం మాత్రమే.. అదే గమ్యం కాదు. లక్ష్యాలను అధిగమించే క్రమంలో అపజయాలు, నిరాశ ఎదురైనా ఆ స్ఫూర్తిని వీడొద్దు. ఒకవేళ ఏదైనా పరీక్షలో ఫెయిల్‌ అయినంత మాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీకు అర్హత ఉంటే.. మళ్లీ ప్రయత్నించండి.. కానీ ఒక పరిమితి మాత్రం పెట్టుకోండి. తప్పనిసరిగా ఇతర ఆప్షన్లనూ తెరిచి ఉంచుకోండి. మీరు చదివే సమయాన్ని ఎక్కువ సెషన్లుగా కాకుండా చిన్నచిన్న సెషన్లుగా విభజించుకోండి. హాస్టల్‌లో ఎవరికైనా మనసు బాగా లేకపోతే వాళ్ల దగ్గరకు వెళ్లండి. వారిలో విశ్వాసం నింపే ప్రయత్నం చేయండి. హాస్టల్‌లో మీ స్నేహితులతో ఒక కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే.. మీ దృష్టి ఇంటి వైపు వెళ్లదు.. ఆనందంగా ఉండగలుగుతారు’’ అని కలెక్టర్‌ సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని