లౌక్యంతో విజయం!

మాధవవరానికి చెందిన గిరికి.. ఒక కిరాణా దుకాణం ఉండేది. అతనికి.. సాంబ అనే సహాయకుడు ఉండేవాడు. అతడు పనిలో చేరి కొంత కాలమే అయ్యింది. అయినా చురుకైన వాడు కావడం వల్ల దుకాణం లావాదేవీలన్నీ త్వరగానే తెలుసుకున్నాడు. వ్యాపార పద్ధతి మొత్తం తెలిసింది కాబట్టి, తన గ్రామానికి వెళ్లి దుకాణం పెట్టుకోవచ్చని రోజూ మనసులో అనుకునేవాడు.

Updated : 01 Dec 2021 06:40 IST

మాధవవరానికి చెందిన గిరికి.. ఒక కిరాణా దుకాణం ఉండేది. అతనికి.. సాంబ అనే సహాయకుడు ఉండేవాడు. అతడు పనిలో చేరి కొంత కాలమే అయ్యింది. అయినా చురుకైన వాడు కావడం వల్ల దుకాణం లావాదేవీలన్నీ త్వరగానే తెలుసుకున్నాడు. వ్యాపార పద్ధతి మొత్తం తెలిసింది కాబట్టి, తన గ్రామానికి వెళ్లి దుకాణం పెట్టుకోవచ్చని రోజూ మనసులో అనుకునేవాడు.

అయితే.. కొంత సొమ్ము కూడబెట్టుకున్నాకే, ఆ పని చేయాలని భావించాడు. ఒక రోజు దుకాణానికి రామేశం అనే ధనవంతుడు వచ్చాడు. ఆయన్ను చూడగానే ‘రండి.. రండి..’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు తన యజమాని గిరి. రామేశం కూర్చున్న వెంటనే, తన జేబులోని సరకుల చీటీని తీసి గిరి చేతిలో పెట్టాడు.

గిరి ఆ చీటీని సాంబకు ఇచ్చి.. ‘త్వరగా ఈ సరకులు కట్టు. వేరే వాళ్ల సరకులు కడుతూ ఉంటే వాటిని కాసేపు పక్కనపెట్టు’ అని చెప్పాడు.

సాంబ.. సరకులు కడుతున్నంత సేపూ గిరి, రామేశం ఎదురుగానే కూర్చుని.. ఆయనకు కబుర్లు చెప్పాడు. స్థితిమంతుడు అయ్యేందుకు రామేశం చేసిన కృషిని ఎంతగానో పొగిడాడు. సరకులు కట్టడం పూర్తయ్యాక, వాటిని తీసుకుని రామేశం ఆనందంగా వెళ్లిపోయాడు.

కాసేపటి తర్వాత ఉపాధ్యాయుడు సుందరయ్య దుకాణం దగ్గరకు వచ్చాడు. ఆయన్ను చూడగానే గిరి లేచి నిల్చున్నాడు. అంతేకాదు, సాదరంగా ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టాడు. గిరి ఆయన దగ్గర సరకుల చీటిని తీసుకుని తానే స్వయంగా సరకులు కట్టడం మొదలు పెట్టాడు. సరకులు కడుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సుందరయ్య.. గిరి క్షేమసమాచారాలు అడిగాడు. అలాగే వ్యాపారం ఎలా సాగుతోందని ఆరా తీశాడు.

సరకులు కట్టాక, గిరి స్వయంగా వాటిని సుందరయ్య సంచిలో సర్దాడు. సాంబను ఏ పనీ చేయనీయలేదు. సాంబ.. కేవలం సరకులు అందించాడు. సుందరయ్య డబ్బిచ్చి, నిండు సంచితో తిరిగి వెళ్లాడు. ఆయన వెళ్లేటప్పుడు గిరి వినయంగా నమస్కరించి వీడ్కోలు చెప్పాడు. ఇద్దరితో ఇలా వేరువేరుగా తన యజమాని గిరి ఎందుకు ప్రవర్తించారో సాంబకు అర్థం కాలేదు. ‘కారణమేంటో ఆయన్నే అడగాలి’ అనుకుని, వెంటనే తన సందేహాన్ని బయటపెట్టాడు.

‘తనకు గుర్తింపు ఉండాలని, తనను పొగుడుతూ ఉండాలని, ఎవరో ఒకరు కబుర్లు చెబుతూ ఉండాలనేది రామేశం స్వభావం. అందుకే ఆయనతో అలా చేశాను. ఇక సుందరయ్యగారు మా గురువు. నేను ఈ దుకాణం ప్రారంభించడానికి కారకుడు కూడా ఆయనే. అందుకే ఆయన సరకులను నా చేతులతో కడితేనే నాకు తృప్తి కలుగుతుంది. నేను వినయంగా లేనని భావిస్తే ఆయన మనసు నొచ్చుకోవచ్చు. అందుకే అలా చేశాను..’ నవ్వుతూ చెప్పాడు గిరి. సాంబ సందేహం తీరిపోయింది. అయితే ‘నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకుని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. తర్వాత కొంత కాలానికి సొంతంగా దుకాణం పెట్టి బాగా వృద్ధిలోకి వచ్చి జీవితంలో స్థిరపడ్డాడు సాంబ.                  

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని