Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?
ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం (Diabetes patient) బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం (Diabetes patient) బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయట. జంతువులపై చేసిన ప్రయోగాల్లో- ఉపవాసం వల్ల వాటి ఆయుర్దాయం పెరగటమే కాకుండా నాడీమండల వ్యాధులూ, ముఖ్యంగా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు దరిజేరే అవకాశాలూ తగ్గుతున్నాయని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్’ పరిశోధనల్లో వెల్లడవటం విశేషం. మరి మధుమేహం ఉన్న వారు ఉపవాసం చేయవచ్చా? అంటే...
మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు (Diabetes patient) అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అంటారు. పిండిపదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్ధాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్ అనే ఆమ్ల పదార్ధాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్ బోడీస్’ అంటారు.
శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి. అయితే, చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nizamabad: మోదీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. బైపాస్ రోడ్డు మూసివేత
-
Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Chiranjeevi: త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి.. ఆ హిట్ సినిమా సీక్వెల్?
-
Prohibition: ఎలక్ట్రిక్ డిటోనేటర్లపై కేంద్రం నిషేధం.. ఎప్పటినుంచంటే?
-
KTR: మనవాళ్లు ఎవరో అప్పుడే తెలుస్తుంది: కేటీఆర్
-
Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి