అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు

వైరస్‌ బలహీనపడటమో, టీకాల పుణ్యమో.. అదృష్టం కొద్దీ కొవిడ్‌-19 మునుపటంత తీవ్రంగా బాధించటం లేదు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లో మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. పెద్దగా వేధించకుండానే నయమవుతోంది. అయినా అలసత్వం అసలే చూపొద్దు. వైరస్‌ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాల్సిందే.

Updated : 25 Jan 2022 05:22 IST

వైరస్‌ బలహీనపడటమో, టీకాల పుణ్యమో.. అదృష్టం కొద్దీ కొవిడ్‌-19 మునుపటంత తీవ్రంగా బాధించటం లేదు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లో మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. పెద్దగా వేధించకుండానే నయమవుతోంది. అయినా అలసత్వం అసలే చూపొద్దు. వైరస్‌ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాల్సిందే. ఇంట్లోనే ఉంటున్నా తగు చికిత్స తీసుకోవాల్సిందే. ఆందోళన చెందకుండా, అవగాహన పెంచుకొని మసలుకుంటే త్వరలోనే మహమ్మారి అంతం ఖాయం.

డెల్టా మాదిరిగా ఒమిక్రాన్‌ రకం వైరస్‌తో తలెత్తే కొవిడ్‌ జబ్బు  తీవ్రం కావటం లేదు. కానీ 70 రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తోంది. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్టేననీ అన్నా అతిశయోక్తి కాదు. ఇది చాలావరకు ముక్కు, గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసనాళం, ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపటం లేదు. కొద్దిగా జ్వరం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించటం వంటి లక్షణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తటం లేదు. ఆక్సిజన్‌ శాతం పడిపోవటం, ఆయాసం రావటం, శ్వాసవ్యవస్థ విఫలం కావటం వంటి తీవ్ర ఇబ్బందులేమీ ఉండటం లేదు. అందుకేనేమో చాలామంది ప్రస్తుతం కొవిడ్‌-19ను తేలికగా తీసుకుంటున్నారు. ఒమిక్రాన్‌ రకం వైరసే కదా, ఏమీ కాదులే అని అలసత్వం వహిస్తున్నారు. ఇది సరికాదు. కొవిడ్‌ బారినపడుతున్న అందరికీ ఒమిక్రాన్‌ వైరసే సోకిందని చెప్పలేం. ఎందుకంటే వాతావరణంలో డెల్టా వైరస్‌ ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ రకం వైరస్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉండటం వల్ల అంతా ఇదే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. నిజానికి ఎవరికి ఏ రకం వైరస్‌ సోకిందనేది చెప్పటం కష్టం. మామూలు జలుబు లక్షణాలుంటే ఒమిక్రాన్‌ రకం వైరస్‌ అయ్యిండొచ్చన్నది వైద్యుల అంచనా మాత్రమే. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల్లో ఏ రకం వైరస్‌ అన్నది తేలదు. జన్యు విశ్లేషణ చేస్తేనే బయటపడుతుంది. మనదగ్గర కేవలం 5% నమూనాల్లోనే జన్యు విశ్లేషణ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎస్‌ జీన్‌ పరీక్షతో దీన్ని గుర్తించొచ్చని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది నెగెటివ్‌గా ఉంటే ఒమిక్రాన్‌ వైరస్‌ అయ్యిండొచ్చు గానీ కచ్చితంగా అదేనని చెప్పటం కష్టం. ఎలాంటి రకం వైరస్‌ అయినా అశ్రద్ధ చూపటం తగదు. పైగా ఒమిక్రాన్‌ చాలా వేగంగా విస్తరిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

కాస్త సడలింపు

కొవిడ్‌ తీవ్రత తగ్గిన నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కూడా నిర్ధరణ పరీక్షలు, విడిగా ఉండటం, చికిత్సల విషయంలో కొన్ని సడలింపులు సూచించింది. మధ్యస్థ, తీవ్రదశ ఇన్‌ఫెక్షన్‌లో మాత్రం చికిత్సల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఇప్పుడు చాలామందికి తొలిదశలోనే జబ్బు నయమవుతోంది. మునుపటిలా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ అవసరపడటం లేదు. ఇదే ఇప్పుడు కాస్త ఊరట కలిగిస్తోంది.

అందరికీ తేలికగానే తగ్గుతుందా?

ఒమిక్రాన్‌ రకంతో వచ్చిన కొవిడ్‌-19 చాలామందికి తేలికగానే తగ్గుతుండటం నిజమే. కానీ అందరిలోనూ మామూలు లక్షణాలకే పరిమితమవ్వాలనేమీ లేదు. ఆరోగ్యవంతులను, ఇతరత్రా జబ్బుల్లేని వారిని, టీకాలు తీసుకున్నవారినిది పెద్దగా ఇబ్బంది పెట్టటం లేదు. అయితే మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, టీకాలు పూర్తిగా తీసుకోనివారికి తీవ్రంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. కాబట్టి నిర్లక్ష్యం వహిస్తే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.


లక్షణాలు మామూలుగా ఉంటే ఇంట్లోనే..

ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా.. ముక్కుదిబ్బడ, జ్వరం, గొంతునొప్పి వంటి కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపించినా ముందుగా చేయాల్సింది ఇంట్లోనే ఉండటం. మామూలు జలుబే కదా అనుకొని అందరిలో కలిసి తిరగటం తగదు. ఈలోపు ఇంట్లోవాళ్లకు, బయటివాళ్లకు వైరస్‌ అంటుకునే ప్రమాదముంది. కొవిడ్‌ నిర్ధరణ అయినా, కాకున్నా చికిత్సలో పెద్దగా మార్పేమీ ఉండదు. వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేకించి మందులేవీ ఇవ్వటం లేదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తున్నారు. లక్షణాలు మామూలుగా ఉన్నప్పుడు జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు.. ముక్కుదిబ్బడ, గొంతులో గరగరకు యాంటీ హిస్టమిన్‌ మాత్రలు.. దగ్గు వస్తుంటే దగ్గుమందు వాడుకోవచ్చు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. వీలైతే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి మందులు తీసుకుంటే మంచిది. లక్షణాలు తగ్గుముఖం పడుతుంటే పరీక్షలేవీ అవసరం లేదు. ఏడు రోజుల తర్వాతే బయటకు రావాలి. ఒకవేళ రెండు రోజులుగా మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. కొవిడ్‌ నిర్ధరణ అయ్యి, లక్షణాలు మామూలుగానే ఉంటే అవే మందులు కొనసాగించాల్సి ఉంటుంది. సాధారణంగా తేలికపాటి లక్షణాలు నాలుగైదు రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ లక్షణాలు ఐదు రోజులయినా తగ్గకపోతే ఇన్‌హేలర్‌ రూపంలో బుడిసెనైడ్‌ మందు వాడుకోవచ్చు.

ఆక్సిజన్‌ శాతం పరీక్షించుకోవాలి  

ఒమిక్రాన్‌ రకం ఇన్‌ఫెక్షన్‌లో ఆక్సిజన్‌ శాతమేమీ తగ్గటం లేదు. కానీ ఏ రకం వైరస్‌ సోకిందో తెలియదు కాబట్టి ప్రతి 6 గంటలకు రక్తంలో ఆక్సిజన్‌ శాతం చూసుకోవటం మంచిది. అలాగే 6 నిమిషాల సేపు నడిచిన తర్వాత ఆక్సిజన్‌ శాతం పడిపోతోందేమో కూడా చూసుకోవాలి. ఆక్సిజన్‌ శాతం 93 కన్నా కిందికి పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఒకటికి రెండు సార్లు ఆక్సిజన్‌ శాతాన్ని పరిశీలించాకే తగ్గుతున్న విషయాన్ని నిర్ధరించుకోవాలి. ఆక్సీమీటర్‌ను కుడి చేయి మధ్యవేలుకు పెట్టుకొని, కాసేపు ఉంచి పరీక్షించుకోవాలి.

* ప్రతి 8 గంటలకు ఒకసారి థర్మామీటర్‌తో ఉష్ణోగ్రత ఎంతుందో చూసుకోవాలి.

* ప్రతి 6 గంటలకు ఒకసారి కాసేపు బోర్లా పడుకోవాలి. దీంతో శ్వాస బాగా ఆడుతుంది.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి

జ్వరం వచ్చినప్పుడు ఒంట్లోంచి నీరు, నీటితో పాటు లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో నీరసం ఎక్కువవుతుంది. ఒంట్లో నీటిశాతం మరీ పడిపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కాబట్టి నీరు, ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

నిబ్బరంగా ఉండాలి

కొవిడ్‌-19 గతంలో తీవ్రంగా విరుచుకుపడింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఆ భయాలు ఇంకా వీడలేదు. తిరిగి కొవిడ్‌ బారినపడితే అవి వెంటాడే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి నిబ్బరంగా ఉండటం అలవరచుకోవాలి. భయపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో సమస్య తీవ్రమవుతుంది. భయం మూలంగానే చాలామంది ఆసుపత్రిలో చేరటం చూస్తున్నాం. అందువల్ల భయపడకుండా చూసుకోవాలి. ఇందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలక్షేపానికి టీవీలో, ఫోన్‌లో వినోదాత్మక కార్యక్రమాలు చూడాలి. ఆత్మీయులతో ఫోన్‌లో మాట్లాడుకోవాలి. వీడియో కాల్స్‌ చేసుకోవాలి. జబ్బు నుంచి దృష్టి మరల్చి, మరచిపోయే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని, ఏమీ తోచటం లేదని సిగరెట్లు కాల్చటం, మద్యం తాగటం వంటివి చేయొద్దు. సామాజిక మాధ్యమాల సందేశాలను నమ్మొద్దు.


* ఇప్పటికే మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు గలవారు  ముందుగానే డాక్టర్‌ను కలిసి, చికిత్స తీసుకోవటం తప్పనిసరి.


* ఆక్సిజన్‌ 93% కన్నా తగ్గినా, ఆయాసం పెరుగుతున్నా, జ్వరం తీవ్రంగా ఉంటూ ఐదు రోజులైనా తగ్గకపోయినా, దగ్గు విపరీతంగా వస్తున్నా వెంటనే డాక్టర్‌ సలహా తీసుకోవాలి.


యాంటీవైరల్‌ మందు ప్రభావం అంతంతే

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 నిర్మూలనకు మోల్నుపిరవిర్‌ మందు అందుబాటులోకి వచ్చింది. వైరస్‌ వృద్ధిని తగ్గించటానికి ఈ మందును అత్యవసర చికిత్స కోసం మనదగ్గర అనుమతించారు. దీన్ని తక్కువ మంది మీద.. అదీ డెల్టా రకం వైరస్‌ మీద, టీకాలు తీసుకోనివారి మీద పరీక్షించారు. అందువల్ల ఒమిక్రాన్‌ మీద, టీకాలు తీసుకున్నవారి మీద ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. పైగా మనం వైరస్‌ సంఖ్యను తెలిపే పరీక్షలు చేయటం లేదు. జ్వరం తీవ్రంగా ఉన్నవారికి, వైరస్‌ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చన్న ఉద్దేశంతోనే మోల్నుపిరవిర్‌ను ఇస్తున్నారు. ఒమిక్రాన్‌ రకం ఇన్‌ఫెక్షన్‌లో జ్వరం వంటి లక్షణాలు తేలికగానే ఉంటున్నాయి. కాబట్టి దీని అవసరం అంతగా లేదనే చెప్పుకోవచ్చు. దీంతో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుకోవాలి. దీన్ని 18 ఏళ్ల లోపువారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదు. సంతానం కలిగే దశలో ఉన్న మహిళలకూ ఇవ్వకూడదు. ఒకవేళ ఇలాంటి మహిళలు మోల్నుపిరవిర్‌ వాడినట్టయితే కొవిడ్‌ తగ్గిన 3 నెలల తర్వాతే గర్భం ధరించేలా చూసుకోవాలి.


ముందే యాంటీబయోటిక్స్‌ వద్దు

కొందరు ముందే అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్‌ మందులు వేసుకోవటం ఆరంభిస్తున్నారు. ఇది కొవిడ్‌-19 చికిత్సలో ప్రభావం చూపటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. విడవకుండా దగ్గు వస్తుంటే, కళ్లె పసుపుపచ్చగా పడుతుంటేనే యాంటీబయోటిక్స్‌ అవసరమవుతాయని తెలుసుకోవాలి. వీటిని ఇష్టానుసారంగా వాడితే వైరస్‌ యాంటీబాడీలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటుంది. దీంతో మనకు మనమే వైరస్‌ను బలోపేతం చేసినట్టవుతుంది.


ఆసుపత్రికి ఎప్పుడు?

క్సిజన్‌ శాతం తగ్గుతూ.. 93-90 మధ్యలో ఉన్నట్టయితే ఒక మాదిరి జబ్బుగా పరిగణించాల్సి ఉంటుంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండి, జ్వరం తగ్గకపోతున్నా, జ్వరం తీవ్రమవుతున్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. వీరిని మామూలు వార్డులో ఉంచి చికిత్స చేస్తే చాలు. బయటి నుంచి ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. వీరికి వాపు ప్రక్రియ సూచికలను తెలిపే సీఆర్‌పీ, డీడైమర్‌ వంటి పరీక్షలు అవసరం. ఇవి పెరిగితే శరీర బరువును బట్టి ప్రతి కిలోకు 0.5 మి.గ్రా. నుంచి 1 మి.గ్రా. మోతాదులో ఐదు రోజుల వరకు స్టిరాయిడ్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని గరిష్ఠంగా 10 రోజుల వరకు ఇవ్వచ్చు.

* ఇక ఆక్సిజన్‌ శాతం 90 కన్నా పడిపోతున్నా, నిమిషానికి 30 సార్ల కన్నా ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నా ఐసీయూలో చేర్చి, చికిత్స చేయటం తప్పనిసరి. వీరికి స్టిరాయిడ్‌ మందులను మోతాదు 1-2 మి.గ్రా. మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది.

* ఒక మాదిరి, తీవ్ర జబ్బుగలవారికి అవసరాన్ని బట్టి రెమ్‌డెసివిర్‌ మందు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని లక్షణాలు మొదలైన 10 రోజుల్లోపే వాడాలి. అదీ ఆక్సిజన్‌ అవసరమైనవారికే, ఐదు రోజుల పాటే ఇవ్వాలి. వెంటిలేటర్‌, ఎక్మో మీదున్నవారికి, కిడ్నీ, కాలేయ జబ్బులు గలవారికి ఇవ్వకూడదు.


అందరికీ పరీక్షలు అవసరం లేదు

ఇంట్లో ఒకరికి కొవిడ్‌ లక్షణాలు కనిపించినంత మాత్రాన అందరికీ పరీక్షలు అవసరం లేదు. కొవిడ్‌ బారినపడ్డవారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేనివారికి, ఆరోగ్యంగా ఉన్నవారికి, ఇతరత్రా సమస్యలు లేనివారికి నిర్ధరణ పరీక్షలు అవసరం లేదని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు చెబుతున్నాయి. కాకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి మాత్రం పరీక్ష తప్పనిసరి. ఇలాంటివారికి వైరస్‌ సోకినా లక్షణాలు కాస్త ఆలస్యంగా మొదలవ్వచ్చు. తాత్సారం చేస్తే సమస్య తీవ్రంగా పరిణమించొచ్చు. కాబట్టి వీరి విషయంలో అలసత్వం పనికిరాదు. పరీక్ష చేయించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  

* సాధారణంగా ఏడు రోజుల తర్వాత వైరస్‌ దానంతటదే చనిపోతుంది. అయితే కొందరికి చికిత్స పూర్తయ్యాక కూడా మృత వైరస్‌ అవశేషాల మూలంగా నిర్ధరణ పరీక్ష పాజిటివ్‌గా రావొచ్చు. ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం లేదు. కాబట్టి కొవిడ్‌ తగ్గిన తర్వాత వైరస్‌ నెగెటివ్‌ అయ్యిందో లేదో తెలుసుకోవటానికి తిరిగి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.

* ఇంతకుముందు ఛాతీ సీటీ స్కాన్‌ పరీక్షతో కొవిడ్‌ను నిర్ధరించేవారు. ఇప్పుడు సీటీస్కాన్‌లో అందరికీ నెగెటివ్‌గానే వస్తోంది. కాబట్టి సీటీస్కాన్‌ పరీక్ష పెద్దగా ఉపయోగపడటం లేదు. దీన్ని పోలోమని చేసుకోవటం తగదు. కొవిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షల అవసరమూ లేదు.


యాంటీబాడీ చికిత్స అందరికీ కాదు

కొవిడ్‌-19 లక్షణాలు ఏమాత్రం కనిపించినా కొందరు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స తీసుకుంటున్నారు. నిజానిది అందరికీ ఉద్దేశించింది కాదు. 65 ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక జబ్బులు గలవారికి ముందు జాగ్రత్తగా ఇవ్వచ్చని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇది ఇన్‌ఫెక్షన్‌ తొలిదశలోనే.. అంటే 5-7 రోజుల్లోపే ఉపయోగపడుతుంది. ఆక్సిజన్‌ పడిపోయినవారికిది పనిచేయదు. అనవసరంగా యాంటీబాడీ కాక్‌టెయిల్‌ వాడితే వైరస్‌లో మార్పులు తలెత్తే అవకాశముంది. పైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఒమిక్రాన్‌ రకం వైరస్‌ మీద ఎలాంటి ప్రభావం చూపదు.


టీకాల మేలు

టీకా తీసుకున్నవారికీ కొవిడ్‌ వస్తోంది కదాని కొందరు పెదవి విరవటం చూస్తున్నాం. కొవిడ్‌ టీకాల ఉద్దేశం వైరస్‌ వ్యాప్తిని అరికట్టటమే కాదు, జబ్బు తీవ్రం కాకుండా చూడటం కూడా. వీటితో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలావరకు తప్పుతోంది. ఆసుపత్రిలో చేరినా ప్రాణాపాయం కలగకుండా చూస్తున్నాయి. టీకాల ప్రభావాన్ని ఇప్పటికే గమనిస్తున్నాం. ఒమిక్రాన్‌ రకంతో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కాకపోవటానికి ఇదీ ఒక కారణం. అదే టీకా తీసుకోనివారికి వయసుతో నిమిత్తం లేకుండా జబ్బు తీవ్రం అవుతుండటం, ఊపిరితిత్తులు దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించాలి. అందరూ టీకాలు తీసుకుంటే వైరస్‌లో కొత్త మార్పులు తలెత్తకుండానూ చూసుకోవచ్చు. మహమ్మారిని అంతం చేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని