మూత్రంలో మెదడు కణితి ఆనవాళ్లు

మూత్ర పరీక్షతో మెదడు కణితులను గుర్తించొచ్చా? అవుననే అంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. మెదడు కణితుల నిర్ధరణకు మూత్రంలోని మైక్రోఆర్‌ఎన్‌ఏ బలమైన....

Published : 22 Jun 2021 00:22 IST

మూత్ర పరీక్షతో మెదడు కణితులను గుర్తించొచ్చా? అవుననే అంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. మెదడు కణితుల నిర్ధరణకు మూత్రంలోని మైక్రోఆర్‌ఎన్‌ఏ బలమైన జీవసూచిక కాగలదని నగోయా యూనివర్సిటీ అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం. తరచూ మూత్ర పరీక్ష చేయటం ద్వారా కణితులను తొలిదశలో పట్టుకోవటానికి, చికిత్స చేయటానికి వీలుంటుందని ఇది సూచిస్తోంది. ఫలితంగా ఎక్కువకాలం జీవించేలా చూసుకోవచ్చు. మెదడు కణితులను తొలిదశలో గుర్తించటం కష్టం. సాధారణంగా కాళ్లూ చేతుల కదలికలు తగ్గటం, మాట మారటం వంటి లక్షణాలు కనిపించిన తర్వాతే డాక్టర్లను సంప్రదిస్తుంటారు. పరీక్షలు చేయించుకుంటుంటారు. అప్పటికే కణితులు తీసేయలేనంత పెద్దగా అయ్యింటాయి. దీంతో జీవనకాలమూ తగ్గుతుంది. అందుకే తేలికైన, కచ్చితమైన, చవకైన పరీక్ష పద్ధతుల ఆవశ్యకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. నిర్ధరణ జీవసూచికగా క్యాన్సర్‌ కణితుల ఎంఆర్‌ఎన్‌ఏకు ఇటీవల ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఎంఆర్‌ఎన్‌ఏను రకరకాల కణాలు విడుదల చేస్తుంటాయి. ఇవి స్థిరంగా, చెక్కు చెదరకుండా రక్తం, మూత్రం వంటి ద్రవాల్లోకి చేరుకుంటాయి. కాబట్టే పరిశోధకులు దీన్ని ఎంచుకున్నారు. మూత్రాన్ని తేలికగా పట్టొచ్చు. పరీక్ష చేయొచ్చు. నిజానికి మెదడు కణితులకు మూత్రం ఆధారిత బయాప్సీ మీద పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతులతో మూత్రం నుంచి ఎంఆర్‌ఎన్‌ఏను సమర్థంగా వేరు చేయలేం. దీన్ని అధిగమించేందుకే 10కోట్ల జింక్‌ నానో తీగలతో పరిశోధకులు కొత్త పరికరాన్ని రూపొందించారు. ఇది ఒక మిల్లీలీటరు మూత్రం నుంచి కూడా పెద్దమొత్తంలో ఎంఆర్‌ఎన్‌ఏను సేకరించటమే కాదు.. క్యాన్సర్‌ రకాలు, కణితుల సైజుతో నిమిత్తం లేకుండా 97% కచ్చితత్వంతో క్యాన్సర్‌ లేనివారిని పసిగట్టటం గమనార్హం. గ్లయోబ్లాస్టోమా వంటి తీవ్రమైన మెదడు క్యాన్సర్లను తొలిదశలో గుర్తించటానికి తమ అధ్యయనం తోడ్పడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. మున్ముందు కృత్రిమ మేధ, దూర వైద్యం అనుసంధానంతో క్యాన్సర్‌ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవటానికి ప్రజలకు.. క్యాన్సర్‌ స్థితిని గ్రహించటానికి డాక్టర్లకు ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని