Updated : 08 Feb 2022 05:57 IST

కొవిడ్‌ దీర్ఘం

కొవిడ్‌-19 చాలామందికి తేలికగా, త్వరగానే నయమైపోతోంది. కొందరిని మాత్రం దీర్ఘకాలం.. వారాలు, నెలల కొద్దీ విడవకుండా వేధిస్తోంది. ఎందుకిలా? దీనికి దోహదం చేస్తున్న అంశాలేంటి? వీటిని జబ్బు నిర్ధరణ సమయంలోనే గుర్తించే అవకాశముందా? ఈ విషయంలో తాజా అధ్యయనం ఒకటి కొత్త ఆశలు రేపుతోంది. దీర్ఘకాల కొవిడ్‌కు దారితీస్తున్న నాలుగు ముప్పు కారకాలను గుర్తించింది. వీటిని చాలావరకు రక్త పరీక్షల ద్వారానే, అదీ జబ్బు నిర్ధరణ సమయంలోనే గుర్తించే అవకాశముండటం గమనార్హం. వీటి ఆధారంగా దీర్ఘకాలం కొవిడ్‌ లక్షణాలు వేధించే అవకాశమున్నవారిని ముందే పోల్చుకోవచ్చు. తగు చికిత్సలతో దీర్ఘకాల సమస్యగా మారకుండా చూసుకోవచ్చు.

ఆటోయాంటీబాడీలు ప్రధానం: దీర్ఘ కొవిడ్‌కు దారితీస్తున్న ముప్పు కారకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆటోయాంటీబాడీల గురించే. ముఖ్యంగా ఆరు ఆటోయాంటీబాడీలు ముప్పు తెచ్చిపెడుతున్నట్టు తేలింది. ఒకోటి ఒకోరకమైన లక్షణానికి కారణమవుతోంది. ఉదాహరణకు- జబ్బు నిర్ధరణ సమయంలో యాంటీ-ఐఎఫ్‌ఎన్‌-ఆల్ఫా2 ఆటోయాంటీబాడీ గలవారికి దీర్ఘకాలం శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఆటోయాంటీబాడీ ఆయా రోగనిరోధక కణాల పనితీరును నిర్దేశించే ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2 అనే రసాయన సమాచార వాహకానికి అంటుకుపోతుంది. దీంతో రోగనిరోధక కణాల పనితీరు అస్తవ్యస్తమై వాపుప్రక్రియను ప్రేరేపించే అణువుల తయారీ పుంజుకుంటోంది. కణాల కేంద్రకంలో అంటుకునే మరో ఐదు యాంటీన్యూక్లియర్‌ ఆటోయాంటీబాడీలూ దీర్ఘ కొవిడ్‌ లక్షణాలకు దారితీస్తున్నట్టు బయటపడింది.

నాడులకు ఎప్‌స్టీన్‌ బార్‌ దెబ్బ: దీర్ఘ కొవిడ్‌కు ఎప్‌స్టీన్‌-బార్‌ వైరస్‌ సైతం కారణమవుతోంది. సాధారణంగా తొలిసారి ఈ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తాక వైరస్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది. శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసే వేరే ఇన్‌ఫెక్షన్లు తలెత్తినప్పుడు తిరిగి నిద్రలేస్తుంది. అందుకే కొందరిలో ఇది దీర్ఘ కొవిడ్‌ లక్షణాలకు కారణమవుతోంది. కొవిడ్‌ నిర్ధరణ అయినప్పుడు ఏబీవీ చురుకుగా ఉన్నవారికి మతిమరుపు, నిస్సత్తువ, ఊపిరితిత్తుల్లో కళ్లె ఉత్పత్తి కావటం వంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. మామూలుగానైతే రక్తంలో ఏబీవీకి సంబంధించిన పదార్థాలేవీ కనిపించవు. ఇవి ఉన్నాయంటే ఇన్‌ఫెక్షన్‌ చురుకుగా మారిందన్నమాటే. కొవిడ్‌ నిర్ధరణ అయినప్పుడే రక్తంలో ఏబీవీ కనిపిస్తుండం, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతుండటం విచిత్రం.

మధుమేహం చిక్కులు: దీర్ఘ కొవిడ్‌ లక్షణాలు గలవారిలో మూడింట ఒకవంతు మంది టైప్‌2 మధుమేహం బాధితులే. వీరిలో నిస్సత్తువ, దగ్గు, ఇతరత్రా శ్వాసకోశ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

వైరస్‌ సంఖ్య ఎక్కువగా: జబ్బు నిర్ధరణ అయినప్పుడు సార్స్‌-కొవీ-2 జన్యు పదార్థం (ఆర్‌ఎన్‌ఏ) పెద్దమొత్తంలో ఉండటమూ దీర్ఘ కొవిడ్‌కు సూచికగా చెప్పుకోవచ్చు. ఎక్కువ కాలం కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న మూడింట ఒకవంతు మందిలో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఎక్కువగా ఉంటుండటమే దీనికి నిదర్శనం. ఇలాంటివారిలో యాంటీవైరల్‌ మందులతో వైరస్‌ సంఖ్యను ముందే కట్టడి చేయగలిగితే దీర్ఘకాల జబ్బుగా మారకుండా చూసుకునే అవకాశముందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే కొవిడ్‌ తీవ్రంగానే కాదు.. మధ్యస్థంగా ఉన్నవారికీ దీర్ఘ కొవిడ్‌ ముప్పు పొంచి ఉంటున్న నేపథ్యంలో ముమ్మర యాంటీవైరల్‌ చికిత్స అందరికీ ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పలేమనీ పరిశోధకులు భావిస్తున్నారు.

ఇతర ముప్పు కారకాలు: దీర్ఘకాలం కొవిడ్‌ లక్షణాలు గలవారి రక్తంలో ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిజోల్‌ మోతాదులు తక్కువగా ఉంటున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. అందువల్ల కార్టిజోల్‌ భర్తీ చికిత్స ఉపయోగపడొచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే దీన్ని దీర్ఘ కొవిడ్‌ బాధితులకు ఇచ్చి పరీక్షిస్తున్నారు. ఇక మతిమరుపు వంటి నాడీ లక్షణాలు గలవారి రక్తంలో ప్రొటీన్ల మోతాదులు చాలా ఎక్కువగానూ ఉంటున్నాయి. ఇవి నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేస్తున్నట్టు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు