ఆరోగ్య ఖర్జూరం

ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ వంటి సరళ పిండి పదార్థాలు సత్వరం శక్తినిస్తాయి. టానిన్లనే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్లు, వాపు, రక్తస్రావ

Updated : 24 Jan 2022 20:11 IST

ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ వంటి సరళ పిండి పదార్థాలు సత్వరం శక్తినిస్తాయి. టానిన్లనే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్లు, వాపు, రక్తస్రావ నివారణకు తోడ్పడతాయి. బీటా కెరటిన్‌, ల్యుటీన్‌, జియాగ్జాంతిన్‌ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాలను (ఫ్రీ రాడికల్స్‌) అడ్డుకుంటాయి. ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్‌, రొమ్ము, ఎండోమెట్రియల్‌, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయి. జియాగ్జాంతిన్‌ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది. కణాలకు పొటాషియం అత్యవసరం. ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది. ఇందులో ఫంగస్‌, బ్యాక్టీరియా, వైరస్‌ను ఎదుర్కొనే గుణాలూ ఉన్నాయి. పీచు, ఫెనాల్‌ తరగతి ఆమ్లాలు సైతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండెజబ్బుల నివారణకు, రోగనిరోధకశక్తి సక్రమంగా పనిచేయటానికీ ఖర్జూరం తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని